టీడీపీతో పొత్తు వుంటుందని పవన్‌కల్యాణ్ ప్రకటించడంపై సోషల్ మీడియాలో సెటైర్స్ వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే పొత్తులో ఉన్న బీజేపీతో తెగదెంపులు చేసుకోకుండానే టీడీపీతో చెట్టపట్టాలేసుకుని తిరగడం ఏంటని నెటిజన్లు నిలదీస్తున్నారు. అయినా ఇవన్నీ పవన్‌కల్యాణ్‌కు అలవాటైన విషయాలని, ఆయన్ను విమర్శించినా ఫలితం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
2019 ఎన్నికల తర్వాత వామపక్షాలు, బీఎస్పీతో పొత్తు ఏమైందో పవన్‌కల్యాణ్‌కే తెలియాలి. పలుమార్లు ఢిల్లీ వెళ్లి బీజేపీ అగ్రనేతలతో సంప్రదింపులు జరిపి పొత్తు కుదుర్చుకున్నారు. ఆ తర్వాత బీజేపీతో ఆయన కలిసి పని చేసిన దాఖలాలు లేవు. ఆ మధ్య వైజాగ్‌లో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఆ తర్వాత ఎన్‌డీఏ కూటమిలోని మిత్రపక్షాలతో నిర్వహించిన సమావేశానికి పవన్ వెళ్లారు. అనంతరం నిర్వహించిన వారాహియాత్రలో ఏపీలో ఎన్డీఏ సర్కార్ వస్తుందని అన్నారు.
ఇవాళ రాజమండ్రిలో చంద్రబాబుతో ములాఖత్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ 2014లో మాదిరిగా టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయాలనేది తన లక్ష్యమన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీతో కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నట్టు తేల్చి చెప్పారు. బీజేపీ కూడా కలిసి వస్తుందని ఆశిస్తున్నట్టు ఆయన అన్నారు.
ఒకవైపు బీజేపీతో పొత్తులో వుంటూ, మరోవైపు టీడీపీతో సంసారం చేస్తానని చెప్పడం కేవలం పవన్‌కు మాత్రమే సాధ్యమైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ మాత్రం నిన్నటి వరకూ జనసేన తమ మిత్రపక్షమని చెబుతూ వచ్చింది. ఇప్పుడు టీడీపీతో కలిసి రాజకీయ ప్రయాణం సాగిస్తామని పవన్ ప్రకటించిన నేపథ్యంలో బీజేపీ స్పందన ఏంటనే చర్చకు తెరలేచింది.
పవన్‌కల్యాణ్ వ్యక్తిగత జీవితంలో వ్యవహరించినట్టే, రాజకీయంగా కూడా నడుచుకున్నారనే సెటైర్స్ వెల్లువెత్తడం గమనార్హం.