టీడీపీ, జనసేన మధ్య పొత్తు ఖరారు కావడంపై ఏపీ బీజేపీ(బీ) హ్యాపీగా వుంది. ఇదేంటని ఎవరికైనా అనుమానం రావచ్చు. ఏపీ బీజేపీ రెండు రకాలుగా విడిపోయిన సంగతి తెలిసిందే. 2014లో మాదిరిగా టీడీపీ, జనసేనతో కలిసి పోటీ చేస్తే బాగుంటుందని బీజేపీలోని టీడీపీ అనుకూల నాయకులు కోరుకుంటున్నారు. అయితే కేంద్ర బీజేపీ మాత్రం చంద్రబాబుతో గతానుభవాల దృష్ట్యా టీడీపీతో పొత్తుకు ససేమిరా అంటోంది.
టీడీపీతో తాను మాత్రం కలిసి ఎన్నికలకు వెళ్తానని పవన్‌కల్యాణ్ తేల్చి చెప్పారు. ఇక తమతో కలిసి రావాలో, వద్దో బీజేపీనే తేల్చుకోవాలని ఆయన స్పష్టం చేశారు. పవన్ ప్రకటనపై బాబు జనతా పార్టీ (బీజేపీ) నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కడపలో బాబు జనతా పార్టీ నాయకుడు, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి మీడియాతో మాట్లాడుతూ టీడీపీ, జనసేనతో కలిసి బీజేపీ పోటీ చేస్తుందని అన్నారు. ఈ మూడు పార్టీలు కలిసి వైసీపీని ఓడిస్తాయని ఆయన అన్నారు.
వైసీపీకి తమ పార్టీ నాయకులెవరూ మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదన్నారు. ప్రధాని మోడీతో పవన్‌కల్యాణ్ అన్ని మాట్లాడుకునే పొత్తుపై ప్రకటన చేశారన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ఎవరూ భరించలేరన్నారు. చంద్రబాబునాయుడి అరెస్ట్‌ను తమ పార్టీ నాయకులంతా ఖండిస్తున్నట్టు ఆయన చెప్పారు. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనివ్వకూడదని పవన్‌కల్యాణ్ బీజేపీ పెద్దలకు చెప్పారన్నారు. పవన్ ఆలోచన సరైందని మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి అన్నారు.
రాజమండ్రిలో పవన్ కామెంట్స్ విన్న తర్వాతే తాను మాట్లాడుతున్నట్టు ఆయన అన్నారు.ఎన్డీఏలోనే చంద్రబాబు ఉన్నట్టు ఆయన చెప్పారు. తనకు తెలిసి స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో అవినీతి జరగలేదన్నారు.