రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుతో జనసేనాని పవన్‌కల్యాణ్ ములాఖత్‌పై అందరూ ఊహించినట్టుగానే జరిగింది. పొత్తుపై పవన్‌కల్యాణ్ తేల్చి చెప్పారు. ఇంత కాలం టీడీపీతో కలిసి పోటీ చేయాలా? వద్దా? అనే సంశయంలో ఉన్నానని, ఇవాళ్టితో క్లారిటీకి వచ్చినట్టు పవన్ తెలిపారు. చంద్రబాబు అంతటి నాయకుడినే జైల్లో పెట్టినప్పుడు, ఇక ఎన్నికల్లో కలిసి పోటీ చేయకుండా ఎలా వుండాలంటూ ఆయన ప్రశ్నించారు.
టీడీపీ, జనసేన పొత్తు ప్రకటన కేవలం లాంఛనమే అని, వాళ్లిద్దరి ముందే ఒక అవగాహన వచ్చిందని సమాచారం. పొత్తులో భాగంగా జనసేనకు 23 అసెంబ్లీ, 3 లోక్‌సభ స్థానాలు ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరించారు. ఇదే మహాప్రసాదమని పవన్‌కల్యాణ్ కూడా ఇందుకు అంగీకరించినట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ముఖ్యమంత్రిగా పవన్‌కల్యాణ్ చూడాలనే కోరికను జనసేన శ్రేణులు మరిచిపోవాల్సిందే.
టీడీపీ విషయానికి వస్తే 152 అసెంబ్లీ, 22 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయనుంది. బీజేపీతో సంబంధం లేకుండానే ఎన్నికలకు వెళ్లాలని టీడీపీ, జనసేన నిర్ణయించుకున్నాయి. వామపక్షాలు తమకు కనీసం ఒక్కో సీటు కావాలని కోరుతున్నాయి. అయితే వాటిని కలుపుకుంటారా? లేదా? అనేది చంద్రబాబు నిర్ణయంపై ఆధారపడి వుంటుంది.
ఇదిలా వుండగా టీడీపీతో పొత్తును అధికారికంగా ప్రకటించేందుకు పవన్‌కల్యాణ్ ఒక సాకు కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు జైల్లో ఉన్న సమయాన్ని చూసుకుని పవన్‌కల్యాణ్ ఆవేశపూరితంగా తన మనసులో మాటను వెల్లడించడం గమనార్హం.