ఖుషి సినిమా రిజల్ట్ సంగతి పక్కనపెడితే, అందులో పాటలు మాత్రం సూపర్ హిట్. తన సాంగ్స్ తో రిలీజ్ కు ముందే సినిమాకు ఓ హైప్ తీసుకొచ్చాడు హేషమ్. అందులో పాటలు ఓ ఊపు ఊపాయి. ఇప్పుడు మరోసారి హేషమ్ వంతు వచ్చింది. మరో సినిమాతో అతడు రెడీ అయ్యాడు.
నాని హీరోగా నటిస్తున్న 'హాయ్ నాన్న' సినిమాకు హేషమ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ మరో 2 రోజుల్లో ప్రారంభం కాబోతున్నాయి. హేషమ్ పాటలతో ఇప్పటికే అతడికి ఫ్యాన్స్ అయిన చాలామంది ఇప్పుడు 'హాయ్ నాన్న' సాంగ్స్ కోసం ఎదురు చూస్తున్నారు.
సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ గా 'సమయమా' అనే లిరిక్స్ తో సాగే పాటను 16వ తేదీన విడుదల చేయబోతున్నారు. దీనికి సంబంధించి నానిపై ఓ పోస్టర్ కూడా లాంఛ్ చేశారు. నూతన దర్శకుడు శౌర్యువ్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది.
ప్రస్తుతం ఇండస్ట్రీలో మ్యూజిక్ డిపార్ట్ మెంట్ లో గ్యాప్ ఉంది. ఇటు తమన్, అటు దేవిశ్రీ మాత్రమే కనిపిస్తున్నారు. ఇప్పుడు 'హాయ్ నాన్న'తో హేషమ్ మరో మ్యూజికల్ హిట్ కొడితే.. ఆటోమేటిగ్గా ఇండస్ట్రీ అతడి వెంట పడుతుంది.