అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా సృష్టించిన సంచలనం గురించి అందరికీ తెలిసిందే. ఊహించని విధంగా నార్త్ బెల్ట్ లో కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయింది. తగ్గేదేలే అంటూ బన్నీ చూపించిన మేనరిజమ్స్ దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యాయి. ఇప్పుడీ సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది.
హిందీలో కూడా వచ్చిన పుష్ప సినిమాను చాలామంది ప్రముఖులు చూశారు. అలా చూసిన వాళ్లలో బాలీవుడ్ బాద్షా షారూక్ కూడా ఉన్నాడు. అయితే ఇందులో వింతేముంది అనుకోవద్దు. పుష్ప సినిమాను రోజుకు ఒకసారి చొప్పున, వరుసగా 3 రోజులు చూశాడు కింగ్ ఖాన్. ఆ సినిమా చూసి చాలా విషయాలు నేర్చుకున్నానని చెప్పడం విశేషం.
తాజాగా జవాన్ సినిమాతో సక్సెస్ అందుకున్నాడు షారూక్. ఆ సినిమాను మెచ్చుకుంటూ, షారూక్ కు కంగ్రాట్స్ చెబుతూ ఓ పోస్టు పెట్టాడు అల్లు అర్జున్. దానికి ప్రతిస్పందించిన షారూక్.. పుష్ప సినిమాను వరుసగా 3 రోజుల పాటు 3 సార్లు చూసిన విషయాన్ని బయటపెట్టాడు. ఆ క్రమంలో బన్నీని చూసి ఎంతో కొంత నేర్చుకున్నానని వెల్లడించాడు.
పుష్ప అంటే ఫ్లవర్ కాదు, ఫైర్ అనే డైలాగ్ ను పరోక్షంగా ప్రస్తావించాడు షారూక్. తన శ్వాగ్ ను ఫైర్ మెచ్చుకోవడం ఆనందంగా ఉందన్నాడు. ప్రత్యక్షంగా కలిసినప్పుడు ఫైర్ ను హగ్ చేసుకుంటానని కూడా ప్రకటించాడు.