విశాఖలో ఆయుర్వేద వైద్య కళాశాల ఏర్పాటు చేయాలి

విశాఖపట్నంలో ఆయుర్వేద వైద్య కళాశాల ఏర్పాటును పరిశీలించవలసిందిగా శుక్రవారం రాజ్యసభలో వైస్సార్సీపీ సభ్యులు  వి.విజయసాయి రెడ్డి ఆరోగ్య మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌కు విజ్ఞప్తి చేశారు. హోమియోపతి సెంట్రల్‌ కౌన్సిల్‌, ఇండియన్‌ మెడిసిన్‌ సెంట్రల్‌ కౌన్సిల్‌…

విశాఖపట్నంలో ఆయుర్వేద వైద్య కళాశాల ఏర్పాటును పరిశీలించవలసిందిగా శుక్రవారం రాజ్యసభలో వైస్సార్సీపీ సభ్యులు  వి.విజయసాయి రెడ్డి ఆరోగ్య మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌కు విజ్ఞప్తి చేశారు. హోమియోపతి సెంట్రల్‌ కౌన్సిల్‌, ఇండియన్‌ మెడిసిన్‌ సెంట్రల్‌ కౌన్సిల్‌ సవరణ బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చలో విజయసాయి రెడ్డి మాట్లాడుతూ విజయవాడలో ప్రాంతీయ ఆయుర్వేద పరిశోధనా కేంద్రం ఉన్నందున విశాఖపట్నంలో కేంద్ర ప్రభుత్వం ఆయుర్వేద వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలని కోరారు.

నేషనల్‌ ఆయుష్‌ మిషన్‌ కింద కేంద్ర ప్రభుత్వం దేశంలో 4200 ఆయుష్‌ హెల్త్‌, వెల్‌నెస్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించింది. అందులో భాగంగా ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని వెల్‌నెస్‌ సెంటర్లు ఏర్పాటు చేశారో తెలపాలని ఆయన మంత్రిని కోరారు. అలాగే విశాఖపట్నంలో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన 50 పడకల ఆయుష్‌ ఆస్పత్రి నిర్మాణం ఎంత వరకు వచ్చిందో తెలపాలని కూడా ఆయన మంత్రిని కోరారు.

ఈ బిల్లులో ప్రభుత్వం పొందుపరచిన వివిధ అంశాలను పరిశీలిస్తే హోమియోపతి సెంట్రల్‌ కౌన్సిల్‌, ఇండియన్‌ మెడిసిన్‌ సెంట్రల్‌ కౌన్సిల్‌ రెండూ కూడా ఎలాంటి స్వతంత్ర ప్రతిపత్తి లేకుండా ప్రభుత్వ అజమాయిషీ, చెప్పు చేతల కింద పని చేయాల్సి ఉంటుందని స్పష్టం అవుతున్నట్లుగా విజయసాయి రెడ్డి చెప్పారు. జాతీయ ప్రాధాన్యత కలిగిన ఇలాంటి కౌన్సిళ్ళు భారీత వైద్య విధానాన్ని ప్రోత్సహిస్తూ దానిని విస్తృతపరచేలా పనిచేయాలంటే వాటికి స్వయంప్రతిపత్తి అవసరం. అవి స్వతంత్రంగా పని చేసేలా ప్రభుత్వం ఎందుకు అనుమతించ కూడదని ఆయన ప్రశ్నించారు.

ఇక హోమియోపతి విషయానికి వస్తే వైద్య సహాయంతో జరిగే గర్భ విచ్ఛిత్తికి ఆయుర్వేద, హోమియో వైద్యులను అనుమతించేందుకు చట్ట సవరణ చేయాలని  2014లో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ చేసిన ప్రతిపాదన గురించి విజయసాయి రెడ్డి ప్రస్తావిస్తూ ఆ ప్రతిపాదన ఇంకా పరిశీనలోనే ఉందా లేక విరమించుకున్నారా అని ప్రశ్నించారు.

దేశంలో హోమియోపతి మార్కెట్‌ టర్నోవర్‌ ఏటా 4 వేల కోట్ల రూపాయలు ఉంది. ఏటా ఇది 20 శాతం చొప్పున పెరుగుతోంది. ఈ మార్కెట్‌లో కేవలం 15 శాతం మాత్రమే సంఘటిత రంగంలో ఉండంగా మిగిలిన 85 శాతం అసంఘటిత రంగంలో ఉంది. దీనిని క్రమబద్దీకరించడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నదో తెలపాలని ఆయన కోరారు. 

జడ్జీల కూతుర్లు కూడా చట్టంముందు సమానులే