దాదాపు 6 నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఆంధ్రప్రదేశ్ లో సిటీ బస్సులు రోడ్డెక్కాయి. ఈరోజు ఉదయం 7 గంటలకు విశాఖపట్నంలో తొలి సిటీ బస్సు రోడ్డుపైకి వచ్చింది. కరోనాతో మార్చి నెల నుంచి సిటీ బస్సుల రాకపోకలు నిలిపివేశారు. అప్పట్నుంచి డిపోలకే పరిమితమైన సిటీ బస్సు సర్వీసులు ఈరోజు నుంచి మళ్లీ మొదలయ్యాయి..
ఇప్పటికే అంతర్ జిల్లా సర్వీసులు నడుస్తున్నప్పటికీ కరోనాను దృష్టిలో పెట్టుకొని సిటీ బస్సులపై నిషేధం విధించింది సర్కార్. అయితే 20వ తేదీ నుంచి జరగనున్న సచివాలయ ఉద్యోగుల ప్రవేశ పరీక్షలను దృష్టిలో పెట్టుకొని ఇవాళ్టి నుంచి సిటీ బస్సులకు అనుమతులిచ్చారు. అది కూడా ప్రస్తుతానికి విజయవాడ, విశాఖపట్నం సర్కిల్స్ లో మాత్రమే సిటీ బస్సులకు అనుమతినిచ్చారు.
మాస్క్ ఉంటేనే బస్సు ఎక్కనిస్తారు. ఎక్కేముందు థర్మల్ స్కానింగ్ కూడా చేస్తారు. సీటింగ్ కు మార్కింగ్స్ కూడా పూర్తయ్యాయి. 60శాతం ఆక్యుపెన్సీతో మాత్రమే బస్సులు తిరుగుతాయి. 60 ఏళ్లు పైబడిన వ్యక్తులు కూడా తమ సొంత రిస్క్ పై సిటీ బస్సులు ఎక్కొచ్చు. పరిస్థితిని సమీక్షించి రాబోయే రోజుల్లో మిగతా పట్టణాల్లో కూడా సిటీ బస్సులకు అనుమతులు ఇస్తామంటున్నారు అధికారులు.
అటు తెలంగాణలో మాత్రం ఇంకా సిటీ బస్సులపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. జీహెచ్ఎంసీ పరిథిలో కరోనా కేసులు పూర్తిస్థాయిలో అదుపులోకి రాకపోవడంతో పాటు.. నగర వాసులకు రవాణాపై ప్రత్యామ్నాయాలు ఎక్కువగా ఉండడంతో ప్రభుత్వం ఈ దిశగా ఇంకా దృష్టిపెట్టలేదు. అన్ లాక్ లో భాగంగా సిటీ బస్సులపై కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు స్పష్టంగా ఉన్నప్పటికీ.. తెలంగాణ సర్కార్ మాత్రం ఈ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది.