జేమ్స్ బాండ్ 007 సిరీస్ లో ప్రతిష్టాత్మక 25వ చిత్రం రెడీ అయింది. డేనియల్ క్రెగ్ హీరోగా నో టైమ్ టు డై పేరుతో సరికొత్త జేమ్స్ బాండ్ సినిమా ముస్తాబవుతుంది. ఈ సినిమాకు సంబంధించి ట్రయిలర్ విడుదల చేశారు.
జేమ్స్ బాండ్ సిరీస్ లో ఇది 25వ చిత్రమే కాకుండా.. నటుడు డేనియర్ క్రెగ్ కు ఇదే ఆఖరి బాండ్ సినిమా కూడా. ఈ సినిమాతో అతడి అగ్రిమెంట్ పూర్తవుతుంది. జేమ్స్ బాండ్ హీరోల్లో ఇతడు ఆరో హీరో. క్యాసినో రాయల్ తో 007గా మారిన డేనియర్, తాజా చిత్రంతో కలుపుకొని 5 జేమ్స్ బాండ్ సినిమాలు చేశాడు.
ఇక తాజా చిత్రం నో టైమ్ టు డై విషయానికొస్తే.. ఇంతకుముందొచ్చిన బాండ్ చిత్రాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఇది తెరకెక్కిందనే విషయం ట్రయిలర్ చూస్తేనే అర్థమౌతుంది. ఉత్కఠ కలిగించే బైక్ ఛేజ్ లతో పాటు బాండ్ స్పెషాలిటీ కారును కూడా ట్రయిలర్ లో మచ్చుకు చూపించారు. బాండ్ గర్ల్ తో పాటు కీలకమైన ఆర్టిస్టులందరూ ట్రయిలర్ లో కనిపించారు. ఈ సినిమాను లండన్, జమైకా, నార్వే, ఇటలీ దేశాల్లో చిత్రీకరించారు.
2015 తర్వాత మళ్లీ జేమ్స్ బాండ్ సినిమా తెరపైకి రాలేదు. నిజానికి ఈ కొత్త సినిమా గతేడాదే రిలీజ్ కావాల్సింది. కానీ పైన్ వుడ్ స్టుడియోస్ లో జరిగిన భారీ అగ్నిప్రమాదం కారణంగా సినిమా షూటింగ్ ఆలస్యమైంది. అదే ప్రమాదంలో డానియల్ క్రెగ్ కూడా గాయపడ్డంతో షూటింగ్ ఇంకాస్త లేట్ అయింది. దీంతో ఈ ఏడాది కూడా రిలీజ్ చేయలేకపోయారు.
ఎట్టకేలకు ఏప్రిల్ లో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. యూకే, ఇండియాలో ఏప్రిల్ 3న… అమెరికా, ఆస్ట్రేలియాలో ఏప్రిల్ 8న ఈ సినిమా రిలీజ్ అవుతుంది.