ఒకవైపు భారతీయ జనతా పార్టీ, ఏపీ లో తెలుగుదేశం పార్టీని, చంద్రబాబునాయుడును ఏమాత్రం జాలీ దయ లేకుండా ఏకిపారేస్తుంటుంది. అయితే ప్రస్తుతానికి గతి లేని పరిస్థితిలో ఉన్న తెలుగుదేశం మాత్రం కమలంతో మళ్లీ దోస్తీ కట్టడానికి కన్ను గీటుతోంది.
చంద్రబాబు ఇంకా అందుకు ఉపక్రమించలేదు గానీ, అలాంటి సంకేతాలు వదిలి ఎదుటి పార్టీ స్పందన గమనించడానికి అచ్చెంనాయుడు మాత్రం శ్రీకారం చుట్టేశారు. అమరావతి రాజధాని విషయంలో గందరగోళం సృష్టించడానికి కొత్తగా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సు డ్రామా మొదలు పెట్టిన టీడీపీ, పతనవస్థలో ఉన్న తమ పార్టీకి బలం పెంచుకోవడానికి, ఇతర పార్టీల భుజాలు ఎక్కి సవారీ చేయాలని అనుకుంటున్నట్టుగా కనిపిస్తోంది.
అందుకే అచ్చెంనాయుడు నర్మగర్భంగా డైలాగులు వేస్తున్నారు. మూడు పార్టీలూ.. అంటే, టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పనిచేస్తే బాగుంటుందని ప్రజలు సర్వత్రా అనుకుంటున్నారట. అచ్చెంనాయుడు కు ప్రజలు సర్వత్రా తరలి వచ్చి ఆయన చెవిలో చెప్పారో ఏమో మనకు తెలియదు గానీ ఆయన అలాంటి సంకేతాలు ఇస్తున్నారు.
నిజానికి బీజేపీ, తెలుగుదేశాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. వారితో కలిసి నడిస్తే ఆత్మహత్యా సదృశం అవుతుందని వారు గ్రహించారు. పైగా సొంతంగా రాష్ట్రంలో ఎదగాలని అనుకుంటున్న పార్టీ, టీడీపీ నీడలో కుళ్ళిపోవడానికి సిద్ధంగా లేదు.
చంద్రబాబు మాత్రం ఎన్నికల తర్వాత బీజేపీని పల్లెత్తు మాట అనడం లేదు. ఇపుడిలా అచ్చెంనాయుడు ద్వారా ప్రపోజల్ పెడుతున్నారు. మరి కమలనాయకులు ఎలా స్పందిస్తారో చూడాలి.