జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ అయోధ్య అంశం గురించి మాట్లాడుతూ ఉన్నారు. అయోధ్య అంశంను తాము పరిష్కరించామంటూ మోడీ ప్రకటించుకుంటూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అయోధ్య అంశాన్ని పరిష్కరించలేకపోయిందని, తాము పరిష్కరించినట్టుగా ఆయన ప్రకటించారు.
ఇటీవలి మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మోడీ మాట్లాడుతూ.. కశ్మీర్ లో ఆర్టికల్ త్రీ సెవెన్టీ రద్దు గురించి మాట్లాడారు. అయితే జనాలు మోడీ ప్రచారాలను మరీ అంత సీరియస్ గా తీసుకోలేదు. కశ్మీర్ అంశాన్ని హర్యానాలోనూ, మహారాష్ట్రలోనూ వాడుకోవాలని మోడీ చూశారు. అయితే రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ స్పష్టమైన మెజారిటీ పొందలేకపోయింది.
ఆ సంగతలా ఉంటే.. జార్ఖండ్ ఎన్నికల్లో ఇప్పుడు మోడీ అయోధ్య అంశం గురించి మాట్లాడుతూ ఉన్నారు! అయినా అయోధ్య అంశాన్ని బీజేపీ ఎప్పుడు ఎలా పరిష్కరించింది? అయోధ్య అంశం గురించి దాదాపు తొమ్మిదేళ్ల కిందట ఒక తీర్పు వచ్చింది. దానిపై ఇరు వర్గాలూ సుప్రీం కోర్టు ధర్మాసనానికి వెళ్లాయి. తొమ్మిదేళ్ల పాటు విచారించిన న్యాయస్థానం అందుకు సంబంధించి తీర్పును ఇచ్చింది.
అయోధ్య అంశం గురించి ఏదో ఒక పరిష్కారం లభించింది అంటే అది సుప్రీం కోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు మాత్రమే. అందులో ప్రభుత్వ పాత్ర ఏమీ లేదు. మోడీ మధ్యవర్తిత్వంతోనో, బీజేపీ వాళ్ల కృషి వల్లనో సమస్య పరిష్కారం కాలేదు. అందులో రాజకీయ నిర్ణయం కూడా ఏమీ లేదు.
ఇలాంటి నేఫథ్యంలో .. అయోధ్య అంశం తమ వల్ల పరిష్కారం అయ్యిందంటూ మోడీ ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉంది. స్థానిక సమస్యల గురించి మాట్లాడకుండా.. ఇలా మోడీ ఎన్నికల ప్రచారాలు చేస్తున్నారు. ఎదురుదెబ్బలు తగులుతున్నా తీరు మాత్రం మారకపోవడం గమనార్హం.