రాజకీయ నాయకులు తాము వ్యతిరేకించే ఇతర పార్టీలు తీసుకునే ప్రతినిర్ణయాన్నీ తప్పుపట్టాలని, దానికి రకరకాల వక్రప్రయోజనాలు పులిమి.. నానా రాద్ధాంతం చేస్తుంటారు. అందులో వారికి మంచి చెడుల విచక్షణ ఉండదు. వీలైనంత వరకూ బురద చల్లడం మాత్రమే. అయితే.. భారతీయ జనతా పార్టీ నాయకులు చేసిన అలాంటి ప్రయత్నాన్ర్ని కోర్టు తప్పుపట్టింది. ప్రజాప్రయోజనంతో సంబంధంలేని వ్యాజ్యం వేసినందుకు మందలించింది.
ఇంతకూ విషయం ఏమిటంటే.. తిరుమలకు సహజంగానే ఉండే భక్తుల రద్దీకితోడు, వాహనాల రద్దీ కూడా పెరుగుతుండడంతో.. తిరుపతిలోని అలిపిరి బైపాస్ రోడ్డులో గరుడ వారధి పేరుతో భారీ ఫ్లై ఓవర్ ను ప్లాన్ చేశారు. సుమారు ఏడాది కిందట ఈ పనులు ప్రారంభం అయ్యాయి. ఈ ఫ్లైఓవర్ పూర్తయితే.. తిరుపతి నగర వాసులకు ట్రాఫిక్ చిక్కుల చాలావరకు తగ్గుతాయి.
ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం 67 శాతం నిధులు భరిస్తుంది. మిగిలిన ఖర్చు రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ఉంటుంది. అయితే.. గరుడ వారధికి టీటీడీ నిధులు ఎలా కేటాయిస్తారంటూ.. భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.భానుప్రకాష్ రెడ్డి ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
టీటీడీ నిధులు వారధి నిర్మాణానికి కేటాయిస్తే అందులో మీకు అభ్యంతరం ఏంటంటూ.. కోర్టు పిటిషనర్ కు బుద్ధి చెప్పింది. ఆ వారధి వల్ల గరిష్టంగా తిరుమల వెళ్లే భక్తులకే ప్రయోజనం కలుగుతుంది. ఆ రకంగా భక్తుల వాహన రాకపోకలు సులువవుతాయి, పెరుగుతాయి. అందుకోసం టీటీడీ కొంత నిధులను వెచ్చించడంపై ఇతరులకు అభ్యంతరం ఎందుకనే అభిప్రాయం వ్యక్తం అయింది. ఈ పిటిషన్లో అసలు ప్రజాప్రయోజనమే లేదంటూ కొట్టి పారేసింది.
ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా.. వాటిని తప్పు పట్టడం, రాజకీయ మైలేజీ సాధించడం అనేది విపక్షాలకు ఒక మార్గంగా ఉంటుంది. రాష్ట్రంలో సొంత అస్తిత్వం ఉండే పార్టీగా ఎదగాలని అనుకుంటున్న భాజపా నాయకులు.. రాష్ట్రానికి కేంద్రం నుంచి పథకాలను, నిధులను, ప్రత్యేకహోదాను తీసుకురావడం ద్వారా తాము కీర్తి గడించడం సాధ్యం అని తెలుసుకోలేక… ఇలాంటి బురదచల్లే మార్గాలను ఎంచుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. వారి ఆలోచనలకు తగినట్లే అవి బెడిసి కొడుతున్నాయి.