బాబు అరెస్ట్‌.. లాభ‌న‌ష్టాల‌పై అంచ‌నాలు!

స్కిల్ స్కామ్‌లో చంద్ర‌బాబునాయుడు అరెస్ట్ అన్ని రాజ‌కీయ ప‌క్షాల్ని ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. ఎందుకంటే చంద్ర‌బాబు అప‌ర మేధావి అని, త‌ప్పు చేసినా ఆధారాలు లేకుండా చూసుకుంటార‌ని, ఆయ‌న ఎప్ప‌టికీ చ‌ట్టానికి చిక్క‌ర‌ని, వ్య‌వ‌స్థ‌ల్ని…

స్కిల్ స్కామ్‌లో చంద్ర‌బాబునాయుడు అరెస్ట్ అన్ని రాజ‌కీయ ప‌క్షాల్ని ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. ఎందుకంటే చంద్ర‌బాబు అప‌ర మేధావి అని, త‌ప్పు చేసినా ఆధారాలు లేకుండా చూసుకుంటార‌ని, ఆయ‌న ఎప్ప‌టికీ చ‌ట్టానికి చిక్క‌ర‌ని, వ్య‌వ‌స్థ‌ల్ని మేనేజ్ చేయ‌గ‌ల దిట్ట అని ఇలా ఇంత కాలం ఎన్నెన్నో చెప్పుకోవ‌డం తెలిసిందే. ఇవ‌న్నీ నిజం కూడా. అయితే ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి మొండివాడు కావ‌డంతోనే చంద్ర‌బాబు అరెస్ట్ జ‌రిగింద‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు అరెస్ట్‌, అనంత‌ర ప‌రిణామాల‌పై పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. చంద్ర‌బాబు అరెస్ట్ రానున్న ఎన్నిక‌ల‌పై ఎలాంటి ప్ర‌భావం చూపుతుంద‌నేది ప్ర‌ధాన చ‌ర్చ‌. బాబు అరెస్ట్ అవాంఛ‌నీయ ప‌రిణామ‌మే అయిన‌ప్ప‌టికీ, దీని వ‌ల్ల త‌మ‌కు రాజ‌కీయంగా లాభ‌మే అని టీడీపీ నేత‌లు అంటున్నారు. 74 ఏళ్ల చంద్ర‌బాబును అరెస్ట్ చేయ‌డంతో ఆయ‌న‌పై సానుభూతి క‌లుగుతోంద‌ని, ఇది ఎన్నిక‌ల్లో త‌మ‌కు క‌లిసి వ‌స్తుంద‌ని టీడీపీ నేత‌ల వాద‌న‌.

మంచి ప‌నులు చేయాల‌ని వైఎస్ జ‌గ‌న్‌కు అధికారం అప్ప‌గిస్తే, ఆయ‌న మాత్రం వ్య‌క్తిగ‌త క‌క్ష తీర్చుకోడానికి ప్ర‌తిప‌క్ష నాయకుల‌పై అక్ర‌మ కేసులు, చంద్ర‌బాబు లాంటి సీనియ‌ర్ నాయ‌కుల అరెస్ట్‌ల‌కు తెగ‌బ‌డ్డార‌నే భావ‌న‌, అసంతృప్తి త‌ట‌స్థుల్లో ఏర్ప‌డింద‌ని టీడీపీ నేత‌లు వాదిస్తున్నారు. బాబు అరెస్ట్ ఒక్క శాతం సానుభూతికి దారి తీసినా త‌మ‌కు ఎంతో మేలు క‌లిగించిన‌ట్టే అవుతుంద‌ని టీడీపీ నేత‌లు అంటున్నారు.

వైసీపీ విష‌యానికి వ‌స్తే, టీడీపీ నేత‌ల వాద‌న‌కు పూర్తి భిన్నంగా వుంది. గ‌తంలో అలిపిరిలో న‌క్స‌లైట్లు మందుపాత‌ర పేల్చిన‌ప్పుడే చంద్ర‌బాబుపై జ‌నంలో సానుభూతి క‌ల‌గ‌లేద‌ని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు అవినీతి కేసులో జైలుకు పంపితే సానుభూతి ఎందుకొస్తుంద‌ని వైసీపీ నేత‌లు ప్ర‌శ్నిస్తున్నారు. గ‌తంలో త‌మ నాయ‌కుడు వైఎస్ జ‌గ‌న్‌ను 16 నెల‌లు జైలు ఉంచితే, 2014లో సానుభూతితో ఎన్నిక‌ల్లో గెల‌వ‌లేక‌పోవ‌డాన్ని గుర్తు చేస్తున్నారు.

వ్య‌వ‌స్థ‌ల్ని మేనేజ్ చేస్తూ, చ‌ట్టానికి దొర‌క్కుండా అహంకారంతో నాలుగు ద‌శాబ్దాలుగా విర‌వీగుతున్న చంద్ర‌బాబును అవినీతి కేసులో అరెస్ట్ చేయ‌డం ద్వారా సీఎం జ‌గ‌న్ క్రేజ్ పెరిగింద‌ని వైసీపీ నేత‌లు చెబుతున్నారు. ఇలా చంద్ర‌బాబు అరెస్ట్‌పై ఇరు పార్టీల నేత‌లు ఎవ‌రెవ‌రి అంచ‌నాల్లో వారు ఉన్నారు.