అటు రాజకీయాలు, ఇటు సినిమాలు అవలీలగా చేసేస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే కలర్ ఇవ్వడానికి చాలా కిందా మీదా అవుతున్నారు సినిమా జనాలు. వారానికి అయిదు రోజులు వంతున, అప్పుడో వారం, ఇప్పుడో వారం ఇవ్వగలను తప్ప వరుసగా రెండు మూడు వారాలు అంటే కుదరదని చెప్పడం వల్లనే కదా, హరి హర వీరమల్లు సినిమా అలా షెడ్ లో పడి వుంది.
ఏళ్ల కాలంగా పాపం, దర్శకుడు క్రిష్ అలా పక్కన వుండిపోయారు. ఓ మంచి దర్శకుడి కెరీర్ అలా ఆగిపోయింది. నిర్మాత ఎఎమ్ రత్నం సంగతి అయితే చెప్పనక్కరలేదు. అన్ని కోట్ల సినిమా ఎప్పటికి అవుతుందో, అవ్వదో తెలియని పరిస్థితి. ఇప్పటి వరకు పెట్టిన పెట్టుబడికి తెచ్చిన ఫైనాన్స్ కు వడ్డీ పెరుగుతోంది. ఆర్థికంగా ఎఎమ్ రత్నం చాలా ఇబ్బందులు పడుతున్నారని ఇండస్ట్రీ వర్గాల బోగట్టా అయినా పవన్ మనసు కరగడం లేదు.
కానీ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ మాత్రం శరవేగంతో అయిపోతోందన్న కలర్ ఇస్తున్నారు. నిజానికి అదీ అంతంత మాత్రమే. ఇలా స్టార్ట్ చేసారు. అలా చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. వీకెండ్ టైమ్ లో మంగళగిరి వెళ్లి వచ్చారు. రెండు రోజులు షూట్ చేసారో లేదో, మళ్లీ ఛలో రాజమండ్రి అంటున్నారు. మళ్లీ ఒకటి రెండు రోజులు షూట్ చేస్తే వీకెండ్ వచ్చేస్తుంది. ఉస్తాద్ కు ఇచ్చిన రెండు వారాల డేట్ ల్లో ఒక వారం అయిపోతుంది.
ఈ పొలిటికల్ సిట్యువేషన్లు ఎలా ఎటు టర్న్ తీసుకుంటాయో తెలియదు. ఎప్పుడు ఛలో మంగళగిరి అంటూ ఎప్పుడు వెళ్లాల్సి వస్తుందో తెలియదు. తప్పదు, ఇక్కడ ఎవరి తప్పు లేదు. పవన్ పొలిటికల్ కమిట్ మెంట్ లు ఆయనవి. కానీ ఉస్తాద్ యూనిట్ మాత్రం తరుచు ఏదో ఒక స్టాక్ ఫొటో వదలుతూ, షూటింగ్ చకచకా సాగిపోతోందన్న ఫీల్ ను కలుగచేస్తోంది. పైగా ఈ ఫొటొలు వదిలినపుడల్లా పవన్‌ను కీర్తిస్తూ పనిలో పనిగా స్వంత డబ్బా జోడించడం మామూలు అయిపోయింది.
పవన్ కేటాయించిన అరవై రోజుల కాల్ షీట్ లకు మహా అయితే ఇప్పటికి ఓ పది ఖర్చయి వుంటాయేమో? మార్చిలో ఎన్నికలు అనే టాక్ వినిపిస్తోంది. అదే నిజమైతే మరో నెల నుంచి పోలిటికల్ పనుల మీదే వుండాల్సి వస్తుంది పవర్ స్టార్. ఓజి, ఉస్తాద్ ఎన్నికల తరువాతే జనం ముందుకు వస్తాయేమో? హరి హర సంగతి ఆ హరి హరులకే తెలియాలి.