అవినీతి కేసులో చంద్రబాబునాయుడు అరెస్ట్ కావడాన్ని జీర్ణించుకోలేక కొన్ని ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నట్టు ఎల్లో మీడియా ప్రచారం చేస్తోంది. రాష్ట్రంలో గుండె పోటు మరణాలన్నీ బాబు ఖాతాలోకే వెళుతున్నాయి. తద్వారా రాజకీయంగా సానుభూతి పొందేందుకు టీడీపీ శవ రాజకీయాలు చేస్తోందని వైసీపీ విమర్శిస్తోంది.
అధికార, ప్రతిపక్ష పార్టీల శవ రాజకీయాలను కాసేపు పక్కన పెడ్దాం. గుండె పోటుతో మరణించారని ఎల్లో మీడియాలో రాస్తున్న వివరాలు రాస్తున్న తమకు నష్టపరిహారం ఇవ్వాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. కేవలం తమ వాళ్ల మరణాలను రాజకీయాల కోసం వాడుకుంటే సరిపోదని వారు అంటున్నారు. బాబు అరెస్ట్‌ను తట్టుకోలేక ప్రాణాలు పోగొట్టుకున్న బాధిత కుటుంబాలను త్వరలో ఓదార్చుతానని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రకటించిన సంగతి తెలిసిందే.
కేవలం ఓదార్పు మాటలతో సరిపెడితే కుదరదని, కనీసం ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షలు తక్కవ కాకుండా ఇవ్వాలని వారు కోరుతున్నారు. బాబు వల్ల రాజకీయంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా లబ్ధి పొందిన వాళ్లు ఆరోగ్యంగా బాగున్నారని, కేవలం అభిమానులే తట్టుకోలేక గుండెపోటుకు గురై ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని బాధితులు వాపోతున్నారు. ఈ విషయాన్ని టీడీపీ నేతలు, ఎల్లో మీడియా నిర్ధారిస్తున్న నేపథ్యంలో నష్టపరిహారం ఇవ్వాలని, అట్లైతేనే తమ దగ్గరికి రావాలని బాధితులు డిమాండ్ చేయడం గమనార్హం.