వెండితెరపై పవన్ ది సోలో పెర్ఫార్మెన్స్. కొన్ని హిట్స్ ఇచ్చారు. తన కెరీర్ లో కొన్ని మల్టీస్టారర్లు కూడా చేశారు. అయితే రాజకీయాల్లో మాత్రం ఆయనది ఎప్పుడూ మల్టీస్టారర్ షోనే. కుదిరితే టీడీపీ, కుదరకపోతే బీజేపీతో కలిసి ఆయన పొలిటికల్ సినిమా నడిపిస్తుంటారు. ఒక దశలో కమ్యూనిస్టులతో కూడా పొలిటికల్ మల్టీస్టారర్ చూపించిన రోజులున్నాయి.
అయితే ఈసారి రాజకీయ ముఖచిత్రంపై పవన్ కల్యాణ్ చూపిస్తున్న మల్టీస్టారర్ ఎంతో భిన్నమైనది. ఈసారి బాలకృష్ణతో కలిసి రాజకీయ చిత్రాన్ని చూపించబోతున్నారు పవన్. ఆయనతో కలిసి తెర పంచుకునే అవకాశం రానప్పటికీ, రాజకీయం పంచుకోవడానికి మాత్రం రెడీ అయ్యారు.
చంద్రబాబు జైలుకెళ్లిన వేళ, టీడీపీకి పెద్ద దిక్కుగా మారారు బాలయ్య. అందుబాటులో ఉన్న నేతలతో ఆయనే సమావేశం నిర్వహించారు. చంద్రబాబు కూర్చున్న కుర్చీలోనే కూర్చున్నారు. ఆ తర్వాత ప్రెస్ మీట్ కూడా పెట్టారు. తనదైన తెలుగులో జగన్ పై విమర్శలు కూడా గుప్పించారు. ఇదంతా బాబు కోసమే.
ఓవైపు బాలకృష్ణ అలా దూసుకుపోతుంటే, మరోవైపు పవన్ కల్యాణ్ క్షేత్రస్థాయిలోకి దూకారు. రోడ్డుపై బైఠాయించారు. ఏకంగా పడుకొని ఫొటోలకు పోజులిచ్చారు. పోలీసులపై ఫైర్ అయ్యారు. ఇది కూడా చంద్రబాబు కోసమే.
ఇలా బాబు కోసం విడివిడిగా పనిచేసిన బాలయ్య-పవన్.. ఇప్పుడు కలిసి పనిచేయబోతున్నారు. చంద్రబాబు జైలుకెళ్లిన అంశాన్ని పూర్తిస్థాయిలో తమ రాజకీయాల కోసం వాడుకోవాలని చూస్తున్నారు.
పార్టీ మరిచావా పవన్.. అయితే సరిగ్గా ఇక్కడే పవన్ పై విమర్శలు చెలరేగుతున్నాయి. చంద్రబాబుపై తన పితృ ప్రేమను చూపించుకోవడంలో తప్పులేదు. కానీ అదే టైమ్ లో తనకు కూడా ఓ పార్టీ ఉంది, దాన్ని వ్యవస్థాగతంగా అభివృద్ధి చేయాలనే తలంపు పవన్ కు లేకపోవడం/రాకపోవడం బాధాకరం అంటున్నారు చాలామంది.
ఓవైపు తన పార్టీని వదిలేసి, మరోవైపు పొత్తులో ఉన్న బీజేపీని కూడా పట్టించుకోకుండా.. ఇప్పుడు బాలకృష్ణతో కలిసి టీడీపీని ఉద్ధరించే పని పెట్టుకున్నారు పవన్ కల్యాణ్. అదే మేజిక్కు. రాబోయే రోజుల్లో ఈ పొలిటికల్ మల్టీస్టారర్ మూవీ ఎన్ని సిత్రాలు చూపిస్తుందో..!