చంద్రబాబుకు మర్యాదలు తక్కువ చేస్తున్నారని ఎల్లో మీడియా, టీడీపీ నేతలు తెగ బాధపడిపోతున్నారు. చంద్రబాబు అతిథిగా రాజమండ్రి జైలుకు వెళ్లలేదనే సంగతిని వారు మరిచినట్టున్నారు. తప్పు చేశారని కారణంతో జైలుకు పంపుతారు. జైలు అంటేనే శిక్షా కేంద్రం. అలాంటప్పుడు లగ్జరీగా సౌకర్యాలు వుంటాయని ఎలా మాట్లాడుతున్నారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
మాజీ ముఖ్యమంత్రి కావడం వల్లే చంద్రబాబుకు రాజమండ్రి సెంట్రల్ జైల్లో కేటగిరి 1 కింద ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నారు. నిజంగా తనకు ప్రత్యేక సదుపాయాలు కల్పించకపోతే ఆ విషయమై జైళ్లశాఖకు చంద్రబాబు ఫిర్యాదు చేయవచ్చు. అది ఆయన హక్కు కూడా. ప్రత్యేక సౌకర్యాలపై చంద్రబాబు ఏమీ మాట్లాడ్డం లేదు. కానీ మిగిలిన వాళ్లంతా లబోదిబోమనడం వెనుక ప్రజల సానుభూతి పొందే ఎత్తుగడ కనిపిస్తోంది.
బాబు ఉంటున్న బ్యారక్ చుట్టూ దట్టమైన చెట్లు ఉన్నాయని, దీంతో విపరీతమైన దోమలతో ఇబ్బంది పడాల్సి వస్తోందని వాపోతున్నారు. గదిలో కేవలం ఒక ఫ్యాన్, బెడ్ మాత్రమే ఇచ్చారని రామోజీరావు పత్రిక తెగ బాధపడిపోతూ రాసింది. బాబు గదిలో ఒకరే వుంటున్నప్పుడు ఆయనకు ఒకటి కాకుండా పది ఫ్యాన్లు, బెడ్లు ఇస్తారా? ఏంటీ రాతలు? ఇలాంటి రాతలు చంద్రబాబును, రాసే పత్రికను నవ్వులపాలు చేయవా?
అర్థంలేని రాతలు రాసే ముందు ఒకసారి ఆలోచిస్తే మంచిదని నెటిజన్లు హితవు చెబుతున్నారు. చంద్రబాబుకు వేడినీళ్లు ఇవ్వనంత అధ్వానంగా అధికారులు ఎందుకు ప్రవర్తిస్తారు? ఏదో ఒకటి రాసి జగన్ ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయాలనే కుట్ర తప్ప, ఈ రాతల్లో వాస్తవం మచ్చుకైనా కనిపించడం లేదని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు.