చంద్రబాబు బలం బలంగం లీగాలిటీ. కోర్టుల ద్వారా ఆయనను కొట్టేవారు లేరు. తెలుగుదేశం పార్టీ తనదే అని కోర్టుల ద్వారా సాధించడం దగ్గర నుంచి అనేకానేక కేసుల్లో స్టే లు తెచ్చుకుని, వాటిని అలా ఏళ్లు పూళ్లుగా సాగదీయడం వరకు చంద్రబాబు ఘనతలే.
గత నాలుగేళ్లుగా వైకాపా ప్రభుత్వానికి అడుగడుగునా అడ్డం పడుతున్నది కోర్టుల ద్వారానే తప్ప వేరు కాదు. వైకాపా ప్రభుత్వానికి లేదా జగన్ ను కోర్టు మొట్టికాయ అన్న హెడ్డింగ్ లేకుండా పత్రికలు రోజూ వచ్చేవి కాదు. అమరావతి ఇస్యూ కావచ్చు, పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం కావచ్చు, విశాఖ రాజధాని కావచ్చు. ఏ అంశమైనా ముందుకు కదలకుండా అష్ట దిగ్బంధనం చేయడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు.
కానీ తన అరెస్ట్ విషయంలోనే చాలా అంటే చాలా తప్పటడుగులు వేస్తున్నారు. తనను అరెస్ట్ చేస్తారని కొద్ది రోజులు ముందుగానే బాబుగారికి తెలిసింది కదా. బహిరంగసభలోనే ఆ మాట చెప్పారు కదా. ఓ యాంటిసిపేటరీ బెయిల్ అప్లికేషన్ పడేసి వుంటే ఏమయ్యేది? తనను ఎవరు ఏం చేస్తారులే అని ధీమా పడ్డారు. అరెస్ట్ చేసినా, ఇలా అరెస్ట్ అంటే అలా బెయిల్ తెచ్చుకోవచ్చు అని ధీమా పడ్డారు. అది పస్ట్ తప్పిదం.
దానికి తెలుగుదేశం అను ‘కుల’ మీడియా ఏ విధంగా సమర్ధించుకుంది. కావాలనే వేయలేదు. కావాలనే జైలుకు వెళ్లారు. సింపతీ వస్తుంది కదా అంటూ రాసుకువచ్చారు. మరి ఇప్పుడు ఎందుకు ముందస్తు బెయిల్ అప్లికేషన్ వేసారు మరో కేసులో? వేయకుండా వుండొచ్చు కదా. అంటే బాబు గారి ధీమా, అతివిశ్వాసం వల్లనే ముందస్తు బెయిల్ కు వెళ్లలేదు. అక్కడ తప్పిదం జరిగింది, దెబ్బ పడిపోయింది.
రిమాండ్ విధించగానే బెయిల్‌కు వెళ్లకుండా హౌస్ అరెస్ట్ అన్న పాయింట్ మీద ఆధారపడ్డారు. హౌస్ అరెస్ట్ అన్నది చాలా అంటే చాలా చాలా రేర్ కేసు అని తెలుసు. కానీ దాని మీదే వెళ్లి భంగపడ్డారు. ఈ టైమ్ ను వాడుకుని, జ్యుడిషియల్ కస్టడీ అనే ఎత్తుగడ వేసింది ప్రభుత్వం. కచ్చితంగా కౌంటర్ అడుగుతారు. వాయిదాలు పడతాయి అని తెలియదా? అక్కడ పెద్ద తప్పే చేసారు. అప్పుడు కూడా బెయిల్ కు పై కోర్టులకు వెళ్లకుండా ఎందుకు తాత్సారం చేస్తున్నారో తెలియదు. సాధ్యం కాని క్వాష్ కు వెళ్లారు. వన్స్ రిమాండ్ ఇచ్చాక బెయిల్ కు వెళ్లకుండా క్వాష్ కు వెళ్లడం అన్నది సరైన చర్యనా? కాదా అన్నది న్యాయనిపుణులే చెప్పాలి.
ఇప్పుడు మొత్తం మీద లీగల్ తప్పటడుగులు వేస్తున్నారు. దానివల్ల మరింతగా లోపల వుండిపోవాల్సి వస్తోంది.
ఇప్పుడు దీన్ని సవరించుకోవడం కోసం సింపతీగా టర్న్ చేయడానికి కిందా మీదా అవుతున్నారు. నాయకుల చేత స్టేట్ మెంట్లు, సింపతీ ధర్నాలు, ఇలా ఎన్ని రకాలుగా చేయాలో అంతా చేయిస్తున్నారు. దీని వల్ల బాబు అవినీతిపరుడు కాదు, ప్రభుత్వం కక్షసాధిస్తోంది అని బాకా ఊదకలుగుతున్నారు. కానీ అసలు ఈ సర్టిఫికెట్ ఇవ్వాల్సింది కోర్టులు. ఆ సంగత మరిచిపోతున్నారు.
ఇన్నాళ్లు, స్టే లు కారణంగా ఏ కేసు విచారణ వరకు రాలేదు. కానీ ఈ కేసు అలా కాదు. ఆ సంగతి గమనించి ముందుకు వెళ్లాలి.