కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ సర్కార్ ప్రత్యర్థులనే కాదు, మిత్రుల్ని కూడా భయపెడుతూ వుంటుంది. తమను కాదని పక్క చూపులు చూస్తే…. అంతు చూసే వరకూ నిద్రపోదు. మోదీ-అమిత్‌షా నేతృత్వంలోని బీజేపీ సర్కార్ అత్యంత శక్తిమంతమైంది. అలాంటి బీజేపీతో జనసేనాని పవన్‌కల్యాణ్ గేమ్ ఆడుతున్నారు. తనకు తానుగా బీజేపీతో పొత్తు కుదుర్చుకుని, తీరా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీతో కలిసి వెళ్లాలని లోపాయికారి ఒప్పందం కుదుర్చుకోవడంపై కేంద్ర బీజేపీ ఆగ్రహంగా ఉంది.
ఈ నేపథ్యంలో పవన్‌తో ఏపీ బీజేపీ ఒక్కసారిగా మైండ్ గేమ్ ఆడుతోంది. ఇది ఒకింత ఆశ్చర్యపరుస్తోంది. పవన్‌కల్యాణ్‌కు సంబంధించి ఏదో వీక్నెస్ను బీజేపీ సర్కార్ దొరికించుకోవడం వల్లే ఆయనతో గేమ్ స్టార్ట్ చేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయాన్ని ఏపీ బీజేపీ నేతలు “ఆఫ్ ది రికార్డ్”గా చెబుతుండడం గమనార్హం. “పవన్ కల్యాణ్ మమ్మల్ని కాదని ఎక్కడికీ వెళ్లడు. అంతేకాదు, టీడీపీ పొరపాటున కూడా పవన్‌తో కలిసి వెళ్లదు” అని ఏపీ బీజేపీ నేతలు కుండబద్దలు కొట్టినట్టు చెబుతున్నారు.
మరోవైపు జనంతోనే తమ పొత్తు అని, పవన్ వస్తే ఓకే అని ఏపీ బీజేపీ నేతలు లెక్కలేకుండా మాట్లాడ్డం రాజకీయ పక్షాల్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. నిన్నమొన్నటి వరకూ తమ వెంట బీజేపీ నీడలా నడుస్తుందని భావించిన జనసేన నేతలు, అకస్మాత్తుగా ఆ పార్టీలో వచ్చిన మార్పునకు కారణం ఏమై వుంటుందా? అని ఆలోచనలో పడ్డారు. ఎవరినైనా తమ దారికి ఎలా తెచ్చుకోవచ్చో ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి అమిత్‌షాలకు బాగా తెలుసనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏపీ బీజేపీ నేతల మాటలపై పవన్‌తో పాటు జనసేన నేతలెవరూ మాట్లాడ్డం లేదు.
పైపెచ్చు ఇటీవల పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ బీజేపీతో పొత్తులో ఉన్నాం, ఉంటామని క్లారిటీ ఇవ్వడాన్ని గుర్తించొచ్చు. ఇవాళ బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు కూడా జనసేనతో పొత్తులో ఉన్నామన్నారు. రెండు ముద్దు, మూడు వద్దు అని పొత్తులపై వ్యంగ్య ధోరణిలో చెప్పారు.
జనసేన, బీజేపీ మాత్రమే ముద్దు అని, టీడీపీ కలవడం వద్దే వద్దని ఆయన చెప్పకనే చెప్పారు. తాను దేనికీ భయపడనని ప్రగల్భాలు పలికే పవన్‌కల్యాణ్, బీజేపీతో పొత్తు వద్దనుకున్న విషయాన్ని బహిరంగంగా ప్రకటించలేకపోవడానికి కారణాలు తెలియరావడం లేదు. మొత్తానికి పవన్‌కు సంబంధించి ఏదో అంశాన్ని బీజేపీ సర్కార్ చిక్కించుకుందనే ప్రచారం మాత్రం విస్తృతంగా సాగుతోంది.