జనసేనాని పవన్‌కల్యాణ్‌పై విమర్శలు గుప్పించడంలో మంత్రి గుడివాడ అమర్నాథ్ ముందు వరుసలో వుంటారు. పవన్ సామాజిక వర్గానికి చెందిన మంత్రి కావడం గమనార్హం. తమ నాయకుడిపై అమర్నాథ్ విమర్శలతో జనసేన కార్యకర్తలు గిలగిల కొట్టుకుంటున్నారు. తాజాగా పవన్‌పై అమర్నాథ్ ఘాటు వ్యాఖ్యలకు కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి హరిరామజోగయ్య హర్ట్ అయ్యారు.
ఈ నేపథ్యంలో మంత్రి అమర్నాథ్కు హితవచనాలు చెబుతూ ఓ లేఖ రాయడం గమనార్హం. ముందుగా పవన్‌ను మంత్రి అమర్నాథ్ ఏమన్నారో తెలుసుకుందాం. టీడీపీలో పవన్ ఓ సీనియర్ కార్యకర్త మాత్రమే అన్నారు. లోకేశ్, చంద్రబాబు కలిసి లోకేశ్ చెరో భుజం మోయడానికి సిద్ధమయ్యారని తీవ్ర విమర్శలు చేశారు. ఈ విమర్శలకు కౌంటర్‌గా హరిరామజోగయ్య లేఖను చూడొచ్చు. ఆ లేఖలో ఏముందంటే…
“నువ్వు రాజకీయాల్లో బచ్చావి. పైకి రావలసిన వాడివి. సాధారణ మంత్రి పదవికి అమ్ముడుపోయి కాపుల భవిష్యత్‌ని పాడు చేయకు. అనవసరంగా పవన్‌కల్యాణ్‌పై బురదజల్లడానికి ప్రయత్నం చేయకు. నీ భవిష్యత్ కోరి చెబుతున్నా” అని రాసుకొచ్చారాయన. కాపుల ఆత్మాభిమానాన్ని చంద్రబాబు, లోకేశ్‌లకు పవన్ తాకట్టు పెట్టారని ఆ సామాజిక వర్గం ఆవేదన.
ఇదే విషయాన్ని ఇటీవల దర్శకుడు రాంగోపాల్‌వర్మ కూడా ట్విటర్ వేదికగా ఘాటు వ్యాఖ్యలతో చెప్పారు. అలాంటి పవన్‌కల్యాణ్‌కు వత్తాసు పలుకుతూ గుడివాడ అమర్నాథ్కు హరిరామజోగయ్య హితవు చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇంతకంటే విపరీత పోకడలు ఏవైనా వుంటాయా? అనే చర్చకు తెరలేచింది.