ఈ టాలీవుడ్ కు ఏమైంది.. మళ్లీ వరుసగా విషాదాలు

టాలీవుడ్ లో మరోసారి అపశకునాలు కనిపిస్తున్నాయి. అప్పుడెప్పుడో 9 ఏళ్ల కిందట ఇలా మినిమం గ్యాప్ లో ప్రముఖుల్ని కోల్పోయింది టాలీవుడ్. మళ్లీ ఇప్పుడు ఇది రిపీట్ అవ్వడం బాధాకరం. దీంతో టాలీవుడ్ కు…

టాలీవుడ్ లో మరోసారి అపశకునాలు కనిపిస్తున్నాయి. అప్పుడెప్పుడో 9 ఏళ్ల కిందట ఇలా మినిమం గ్యాప్ లో ప్రముఖుల్ని కోల్పోయింది టాలీవుడ్. మళ్లీ ఇప్పుడు ఇది రిపీట్ అవ్వడం బాధాకరం. దీంతో టాలీవుడ్ కు ఏమైందనే చర్చ మరోసారి ఊపందుకుంది.

డిసెంబర్ నెల నుంచి టాలీవుడ్ ను వరుస మరణాలు పట్టిపీడిస్తున్నాయి. కైకాల సత్యనారాయణ, చలపతి రావు, వల్లభనేని జనార్థన్ మృతితో షాక్ కు గురైన టాలీవుడ్ కొత్త ఏడాదిలో కూడా వరుసగా విషాద వార్తలు వినాల్సి వస్తోంది.

అలనాటి మేటి నటి జమున, కళాతపస్వి కె.విశ్వనాద్ రోజుల వ్యవధిలో కన్నుమూయడం టాలీవుడ్ కు గట్టి షాక్ తగిలినట్టయింది. ఈ బాధ నుంచి కోలుకోకముందే లెజండరీ గాయని వాణీ జయరాం మృతి టాలీవుడ్ ను కలచివేసింది. వీళ్లతో పాటు సీనియర్ దర్శకులు సాగర్, స్టార్ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాసమూర్తిని కోల్పోయింది టాలీవుడ్.

2015 చివర్లో కూడా ఇలాంటి ఘటనలే వరుసగా జరిగాయి. సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ తండ్రి సత్యమూర్తి, రచయిత శ్రీనివాస్ చక్రవర్తి, సీనియర్ నటుడు రంగనాధ్, అనూప్ రూబెన్స్ తల్లి రోజుల వ్యవధిలో కన్నుమూశారు.

9 ఏళ్ల కిందట ఇలానే స్టార్ కమెడియన్లంతా రోజుల వ్యవథిలో కన్నుమూశారు. ఆ టైమ్ లో 'మా' ఆధ్వర్యంలో టాలీవుడ్ లో యాగాలు, శాంతిపూజలు కూడా జరిపించారు. ఇలా వరుస మరణాల ఘటనల్ని టాలీవుడ్ గుర్తుచేసుకుంటోంది. మళ్లీ అలాంటి రోజులు ఇప్పుడు రిపీట్ అయ్యాయేమో అనే భయంలో పడిపోయింది ఇండస్ట్రీ.