నెల్లూరు వైసీపీలో అసంతృప్తవాదులు ఒక్కొక్కరుగా బయటపడుతున్నారు. వీరిలో ఎమ్మెల్యేలు వుండడం తీవ్ర చర్చనీయాంశ మైంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సొంత ప్రభుత్వంపై వ్యతిరేక గళం వినిపించారు. దీంతో మొదట ఆనంపై, ఆ తర్వాత కోటంరెడ్డిపై వైసీపీ అధిష్టానం వేటు వేసింది. వారి స్థానాల్లో కొత్త నేతలను నియమించింది.
అయితే ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఒకటిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకపోవడాన్ని గమనించొచ్చు. ఇద్దరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శత్రువు అయినప్పటికీ, ఎవరికి వారుగా ఒంటరిగా ఫైట్ చేస్తున్నారు. ఎక్కడైనా శత్రువుకు శత్రువు మిత్రుడిగా చూస్తుంటారు. కానీ నెల్లూరులో మాత్రం ఈ సూత్రం వర్తించలేదు. ఎందుకంటే ఆనం, కోటంరెడ్డిల మధ్య రాజకీయ వైరం ఈనాటిది కాదు.
నెల్లూరులో ఆనం చేరదీయని నేతలు లేరు. కానీ ఒక దశకు చేరిన తర్వాత ఆనం కుటుంబంపై రాజకీయ దాడి చేస్తుండడంతో, వారిని అణగదొక్కేందుకు రామనారాయణరెడ్డి, దివంగత వివేకానందరెడ్డి ప్రయత్నించేవాళ్లు. ఆనం బ్రదర్స్‌పై కోటంరెడ్డి పరోక్షంగా ఎన్నోసార్లు ఘాటు విమర్శలు చేశారు. ఇటీవల కూడా ఆనంపై కోటంరెడ్డి ఆరోపణలు గుప్పించారు. ఈ నేపథ్యంలో కోటంరెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్‌లకు ఆనం రామనారాయణరెడ్డి దూరంగా వుంటూ వస్తున్నారు.
ప్రస్తుతం రాజకీయ పరిణామాలు మారుతున్నప్పటికీ కోటంరెడ్డితో కలిసేందుకు ఆనం రామనారాయణరెడ్డి ససేమిరా అంటున్నారు. రామనారాయణరెడ్డి దృష్టిలో కోటంరెడ్డి చిల్లర రాజకీయాలు చేసే నాయకుడు. అందుకే ఇప్పుడు కూడా కోటంరెడ్డితో సంబంధం లేకుండానే రామనారాయణరెడ్డి తన స్టైల్‌లో ముందుకెళుతున్నారు. సీఎం జగన్‌కు వ్యతిరేక రాజకీయాలు చేస్తున్నప్పటికీ రానున్న రోజుల్లో వాళ్లిద్దరూ కలిసే అవకాశం ఉండకపోవచ్చు.