తాను పోరాటం వదిలి, ఆ భారాన్ని ఎంపీలపై మోపడం చంద్రబాబునాయుడికే చెల్లింది. పార్లమెంట్ సమావేశాల్లో టీడీపీ అనుసరించాల్సిన వైఖరిపై తన పార్టీ ఎంపీలతో చంద్రబాబు సమావేశం అయ్యారు. ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. పార్లమెంట్లో జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలనే చంద్రబాబు నిర్దేశంపై జనం నవ్విపోతున్నారు.
అసెంబ్లీలో తాను మాత్రం పలాయనం చిత్తగించి, పార్లమెంట్లో ఏపీ సమస్యల్ని లేవనెత్తాలనే చంద్రబాబు సూచనలు ఆయన్ని అభాసుపాలు చేసేలా ఉన్నాయి. ఉభయ చట్టసభల్లో టీడీపీ బలమెంత, వారికిచ్చే సమయం ఎంత? తదితరాలేవీ తెలియకనే బాబు దిశానిర్దేశం చేసి వుంటారా? ఇవన్నీ కేవలం ప్రచార ఆర్భాటానికే తప్ప, ఒరిగేదేమీ ఉండదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకా ఎంత కాలం జనాన్ని మోసగిచ్చే ప్రకటనలని పౌర సమాజం ప్రశ్నిస్తోంది.
ఇటీవల అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ఒక రోజు మాత్రమే సమావేశాలు నిర్వహించాలని జగన్ ప్రభుత్వం ముందుగా భావించింది. అయితే రెండు వారాలు నిర్వహించాలనే టీడీపీ డిమాండ్‌ను పరిగణలోకి తీసుకున్న జగన్ ప్రభుత్వం… వారం పాటు ప్రజాసమస్యలపై చర్చించేందుకు సిద్ధమైంది.
ఈ నేపథ్యంలో అసెంబ్లీలో అనవసర రాద్ధాంతం జరిగి… చివరికి టీడీపీ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించింది. చంద్రబాబు మరో అడుగు ముందుకేసి ఏకంగా తాను సీఎంగా తప్ప, ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో అడుగే పెట్టనని శపథం చేయడం సంచలనం రేకెత్తించింది.
జగన్ ప్రభుత్వ తప్పులను ఏకిపారేసేందుకు అసెంబ్లీ సమావేశాలను సద్వినియోగం చేసుకోకుండా… తక్కువ అవకాశం లభించే పార్లమెంట్ సమావేశాలను వేదిక చేసుకోవాలనే బాబు వ్యూహంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాబుకు నిజంగా ప్రజాసమస్యలపై చిత్తశుద్ధి ఉంటే, అసెంబ్లీ సమావేశాల్లో నిలదీసే వారనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాల్లో జగన్ రైతు వ్యతిరేక విధానాలపై పార్లమెంట్లో చర్చించాలట.
అలాగే ఏపీలో ఇంధన ధరలు, జగన్ ప్రభుత్వ పన్నులు, ధరల పెరుగుదల, ప్రత్యేక హోదా, మూడు రాజధానుల బిల్లు, వైఎస్ వివేకా హత్య, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్షాలపై వైసీపీ దాడులు తదితర అంశాలపై చర్చించాలని టీడీపీ సభ్యులకు చంద్రబాబు సూచించారు.
ఈ పనేదో అసెంబ్లీ సమావేశాల్లోనే చేసి వుంటే ప్రజల నుంచి ప్రశంసలు వచ్చేవి కదా! తాను మాత్రం కాడి వదిలేసి, మరెవరో పోరాటం చేయాలనడం బాబుకే చెల్లింది. ఇలా చౌకబారు వ్యూహాలు బాబుకు మాత్రమే ప్రత్యేకమనే సెటైర్స్ వెల్లువెత్తుతున్నాయి.