మంగళగిరిలో గెలిచి చూపిస్తా, పెద్దాయనకు గిఫ్ట్ ఇస్తానంటూ ఆమధ్య ఎన్టీఆర్ భవన్ పై దాడి జరిగిన సమయంలో తొడగొట్టారు చినబాబు. దానికి తగ్గట్టే నాలుగు రోజులుగా గ్రౌండ్ వర్క్ మొదలైంది. ఎన్నికలు లేవు, ఏమీ లేవు కానీ మంగళగిరిలో లోకేష్ యాత్రలు మొదలుపెట్టారు.
“మన లోకేష్.. మన బండి..” అంటూ వీధి వ్యాపారుల కోసం బండ్లు ఉచితంగా ఇస్తున్నారు. ఫుల్లుగా పచ్చ కోటింగ్ వేసి, తన బొమ్మ కూడా ప్రింట్ చేసి మరీ ఇస్తున్నారు. ఊరూరా ప్రతి టీకొట్టు, బడ్డీకొట్టు వద్ద ఆగి మరీ మాట్లాడుతున్నారు. లోకేష్ కి ఎన్నికల మూడ్ అప్పుడే వచ్చేసిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
వార్డు మెంబర్ గా కూడా గెలవలేని లోకేష్.. అంటూ పదే పదే వైసీపీ నుంచి విమర్శలు వినపడుతున్న నేపథ్యంలో.. లోకేష్ కి ఎక్కడో మంట పుట్టింది. ఈ అవమానాలు తట్టుకోలేక ఎలాగైనా మంగళగిరిలో గెలిచి చూపించాలనుకుంటున్నారు.
రెండేళ్లకు పైగా మంచి నియోజకవర్గం కోసం వెదికి చూసి, ఏపీలో టీడీపీకి కుప్పం సహా ఏ ఒక్కటీ సేఫ్ కాదని తెలుసుకున్నారు చినబాబు. చివరికిప్పుడిలా మంగళగిరిలో మకాం పెట్టారు.
టీడీపీకి జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన లోకేష్.. వాస్తవానికి కనీసం రాష్ట్రస్థాయి రాజకీయాలు కూడా చేయడం లేదు. వరదలొస్తే బురద రాజకీయం చేయడానికి చంద్రబాబు బయటకొచ్చినా, లోకేష్ మాత్రం ఇంకా జనాల్లోకి రాలేకపోతున్నారు.
ఆమధ్య శవ రాజకీయానికి బ్రాండ్ అంబాసిడర్ గా మారిన లోకేష్.. ఇప్పుడు అంతిమ యాత్రలకు కూడా దూరంగా ఉంటున్నారు. ఫైనల్ గా లోకేష్ ఒకటే ఫిక్స్ అయ్యారు. మిగతా రెండున్నరేళ్లు మంగళగిరిలోనే ఉంటూ.. నియోజకవర్గంలో పట్టు పెంచుకునేందుకు ట్రై చేస్తున్నారు.
ఇప్పటినుంచే చిన్న చిన్న తాయిలాలు పంచుతూ జనాన్ని తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముందుగా తోపుడు బండ్లతో మొదలు పెట్టారు. ముందు ముందు లోకేష్ ఫొటోలతో ఇంకేమేం బయటకొస్తాయో వేచి చూడాలి.