మావోయిస్టులు ఎపుడూ ప్రజా హితం వైపే ఉంటారు అని అంటారు. వారు కోరుకునేది కూడా సామాన్యుల క్షేమమే. అలాంటిది గంజాయి సాగుతో గిరిజన జీవితాలు అస్తవ్యస్థం అవుతున్న వేళ మావోయిస్టులు కచ్చితంగా దానికి వ్యతిరేకించి తీరుతారు. అందులో రెండవ మాట లేదు.
అయితే విశాఖ ఏజెన్సీలో మాత్రం మావోయిస్టులు గంజాయి సాగును ప్రభుత్వం తుదముట్టిస్తూంటే వద్దు అంటూ కరపత్రాలు. పోస్టర్లు రిలీజ్ చేస్తున్నారు. ఇది కొంచెం ఆశ్చర్యంగానే ఉంది. అయితే ఆ కరపత్రాలు పోస్టర్లలో ఉన్నదేంటి అంటే గిరిజనులకు వేరే ఉపాధి చూపించకుండా గంజాయి సాగు విద్వంశం చేయడం ఏంటి అని ప్రశ్నిస్తున్నట్లుగా ఉంది.
అంతే కాదు ప్రజలు పోలీసు వాహనాలలో వెళ్ళి గంజాయి తోటలను విద్వంసం చేసే పనులలో పాల్గొనవద్దు అంటూ హెచ్చరించినట్లుగా ఉంది. గతంలో ఇలాంటి హెచ్చరికలు వచ్చాయి, ఇపుడు మరోసారి ఇలా విశాఖ ఈస్ట్ డివిజన్ కమిటీ పేరిట పోస్టర్ రిలీజ్ చేశారు.
దీని మీద పోలీసు వర్గాలు బయటకు మాట్లాడకపోయినా అనేక సందేహలు మాత్రం వ్యక్తం అవుతున్నాయి. చింతపల్లి వీధుల్లో గోడలకు అతికించిన ఈ పోస్టర్ల వెనక నిజంగా మావోలు ఉన్నారా లేక గంజాయి వ్యాపారులు, స్మగ్లర్లు ఉన్నారా అన్న చర్చ అయితే సాగుతోంది. మరి దీని వెనకాల ఎవరు ఉన్నారన్నది పోలీసులే ఆ సీక్రేట్ ఛేదించాలి.
ఇదిలా ఉండగా ఇలాంటి కరపత్రాలు పోస్టర్లు ఎన్ని విడుదల చేస్తున్నా విశాఖ పోలీసులు మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడంలేదు. అంతే కాదు, పరివర్తన పేరిట వారు ప్రతీ రోజూ ఏజెన్సీ మారుమూలల్లోకి వెళ్ళి మరీ ప్రజల సహకారంలో గంజాయి సాగుని మొత్తానికి మొత్తం మట్టుపెడుతున్నారు. మరి మావోలు అయితే ఇప్పటికే అడ్డుకునే వారు కదా అన్న చర్చ అయితే ఉంది.
మొత్తానికి మావోల ముసుగులో గంజాయి వ్యాపారులు ఇలాంటి హెచ్చరికలు జారీ చేస్తే పోలీసులు వారి భరతం పట్టాల్సిందే అంటున్నారు గిరిజనం.