లేక లేక ఓ యంగ్ హీరోయిన్ దొరికింది. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడు నాగార్జున. అంతలోనే ఆ యంగ్ హీరోయిన్ డుమ్మా కొట్టింది. దీంతో సీనియర్ హీరోలో మరోసారి నిరాశ కలిగింది. అలా కొన్నాళ్లుగా కుర్ర హీరోయిన్ కోసం ఎదురుచూస్తున్న నాగార్జునకు ఆ కోరిక తీరింది.
ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున చేస్తున్న సినిమా ది ఘోస్ట్. ఈ మూవీ కోసం కాజల్ ను తీసుకున్నారు. కానీ ఆఖరి నిమిషంలో ఆమె తప్పుకుంది. ఆ స్థానంలో మరో హీరోయిన్ కోసం తెగ ప్రయత్నించారు. అమలాపాల్ ను తీసుకోవాలనుకున్నారు కానీ సాధ్యం కాలేదు. ఇప్పుడు కాజల్ ప్లేస్ లో మెహ్రీన్ సెట్ అయింది.
అవును.. సీనియర్ హీరో నాగ్ సరసన నటించడానికి కుర్ర హీరోయిన్ మెహ్రీన్ ఒప్పుకుంది. ఈ మేరకు మెహ్రీన్ కు అనుకున్న రెమ్యూనరేషన్ కంటే 20 శాతం అధికంగా చెల్లించడానికి నిర్మాతలు ముందుకొచ్చినట్టు తెలిసింది. రేపోమాపో అగ్రిమెంట్ చేయబోతున్నారు.
బాలకృష్ణ, చిరంజీవిలా నాగార్జునకు కూడా హీరోయిన్ల కొరత వెంటాడుతోంది. వైల్డ్ డాగ్ కోసం దియా మీర్జాతో మేనేజ్ చేశాడు. ఇప్పుడు బంగార్రాజు కోసం రమ్యకృష్ణ ఉండనే ఉంది. ఘోస్ట్ కోసం మెహ్రీన్ ను తీసుకోవడంతో నాగార్జునకు కొత్త ఉత్సాహం వచ్చింది.
ప్రస్తుతం బంగార్రాజు సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు నాగ్. సంక్రాంతికి ఆ సినిమాను రిలీజ్ చేయాలనేది ప్లాన్. బంగార్రాజు కొలిక్కి వచ్చిన వెంటనే ది ఘోస్ట్ సెట్స్ పైకి వస్తుంది.