ప్రస్తుతం తెలంగాణలో ఎటు చూసినా జ్వరాలే. మరీ ముఖ్యంగా హైదరాబాద్ లో ఎవ్వర్ని కదిపినా ఫీవర్ అంటున్నారు. సిటీలో హాస్పిటల్స్ అన్నీ కిటకిటలాడుతున్నాయి. చిన్నచిన్న క్లినిక్స్ కూడా ఖాళీ ఉండడం లేదు. దీంతో మరోసారి మాస్క్ ఆవశ్యకత తెరపైకొచ్చింది.
నగరంలో వైరల్ ఫీవర్ కేసులు బాగా పెరగిపోయాయి. దీంతో ఆస్పత్రి సిబ్బందితో పాటు, రోగులు మాస్క్ ధరించాలని సూచిస్తున్నారు వైద్యులు. కొన్ని హాస్పిటల్స్ లో మాస్క్ ను తప్పనిసరి చేశారు. ఏటా ఈ టైమ్ లో రోగాలు సర్వసాధారణం. అయితే ఈసారి ఇన్ ఫ్ల్యూయంజా లాంటి వైరస్ కారకాలు ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నాయి.
స్థూల అంచనా ప్రకారం, చాలా ప్రైవేట్ ఆసుపత్రులలో గత కొన్ని వారాలుగా జ్వరం, దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులతో వస్తున్న రోగుల సంఖ్య రెట్టింపు అయింది. సిటీలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రతిరోజూ 200 నుండి 300 మంది రోగులు ఈ లక్షణాలతో వస్తుంటారు. గడిచిన కొన్ని రోజులుగా ఈ సంఖ్య 200 నుంచి 600కు చేరింది.
ఇలాంటి జలుబు, దగ్గు, జ్వరాల్ని అరికట్టాలంటే మరోసారి ప్రజలంతా మాస్క్ వాడాలని సూచిస్తున్నారు వైద్యులు. రద్దీగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండాలని, వర్షంలో తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఈ సందర్భంగా మందుల వాడకంపై కూడా కొన్ని కీలక సూచనలు చేస్తున్నారు వైద్యులు. ప్రస్తుతం నగరంలో సాధారణంగా వచ్చే జ్వరాలు కావని అంటున్నారు. 3 రోజుల పాటు నాన్-స్టాప్ గా జ్వరం ఉంటే తప్పనిసరిగా వైద్యుడ్ని సంప్రదించాలని సూచిస్తున్నారు.