సోషల్ మీడియాలో అనసూయను ఫాలో అయ్యే వాళ్లందరికీ ఆమె వ్యవహారశైలి గురించి తెలిసిందే. ఓ టాపిక్ ఎత్తుకుంటే, కొన్ని రోజుల పాటు వదలదు అనసూయ. తను తిడుతుంది, నెటిజన్లతో తిట్టించుకుంటుంది. ఇదేదో 2-3 పోస్టులతో ఆగే వ్యవహారం కాదు. రోజంతా సాగుతుంది. కొన్నిసార్లు 2-3 రోజులు నడిచిన సందర్భాలూ ఉన్నాయి.
అయితే ఈ మధ్య అనసూయ తగ్గింది. తను ప్రశాంతత కోరుకుంటున్నానని, సోషల్ మీడియాలో ఇకపై వివాదాలు రేపననే అర్థం వచ్చేలా స్టేట్ మెంట్ ఇచ్చింది. ప్రస్తుతానికైతే చెప్పినట్టుగానే వ్యవహరిస్తోంది ఈ భామ.
అయితే సోషల్ మీడియాలో అనసూయ లేని లోటును ఇప్పుడు రష్మి గౌతమ్ భర్తీ చేస్తోంది. 'సనాతన ధర్మం' అంటూ నిన్నట్నుంచి ఎడతెగని పోస్టులు పెడుతోంది రష్మి. తన అభిప్రాయాల్ని చెబుతూనే, తనపై వస్తున్న విమర్శలు, కామెంట్లను తిప్పికొడుతూ ట్విట్టర్ లో బిజీగా ఉంది.
రష్మి పెడుతున్న సనాతన ధర్మం పోస్టులకు కౌంటర్ గా, ఆమె డ్రెస్సింగ్ స్టయిల్, ఎక్స్ పోజింగ్ పై నెటిజన్లు పలు ప్రశ్నలు సంధిస్తున్నారు. వాటికి ప్రతిస్పందిస్తూ, ఆర్టిస్టుల డ్రెస్సింగ్, నటన అనేది దర్శకుల విజన్ బట్టి ఉంటుందని, అది కళ అని చెబుతోంది రష్మి.
ఈ సందర్భంగా కామసూత్రపై రష్మి చేసిన వ్యాఖ్యలు కూడా చర్చకు దారితీశాయి. భారతీయ సంస్కృతిలో కామసూత్ర కూడా ఓ భాగమని, ఒకప్పుడు మహిళలు వేసుకునే దుస్తుల తీరు చూస్తే తెలుస్తుందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం మహిళలు ఎదుర్కొంటున్న వివక్ష కు హిందూమతంతో, సనాతన ధర్మంతో ఎలాంటి సంబంధం లేదంటోంది.
ఇలా ఒకటి కాదు, రెండు కాదు.. ఎన్నో అంశాలపై స్పందిస్తూనే ఉంది రష్మి. మధ్యమధ్యలో తనకు ఎంతో ఇష్టమైన జంతు ప్రేమను కూడా చూపించింది. దీంతో అనసూయ లేని లోటును రష్మి తీర్చిందంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆమెకు షూటింగ్స్ లేకపోవడంతో, ఇలా టైమ్ పాస్ చేస్తోందని, షూటింగ్స్ ఉంటే రష్మి అసలు రియాక్ట్ అవ్వదంటూ మరికొంతమంది చెబుతున్నారు.