మోడీ మార్చ‌గ‌లిగిన‌వి ఇవేనా, అవి మార్చ‌లేరా!

దేశం క‌రెన్సీని మార్చేశారు! ప‌న్నులు బాదే తీరును మార్చేశారు! పార్ల‌మెంట్ భ‌వనాన్ని మార్చుకున్నారు! మ‌రి వీటితో సామాన్యుడికి ఒరిగింది ఏమిటి అంటే అదో బ్ర‌హ్మ‌ప‌దార్థం! క‌రెన్సీని రాత్రికి రాత్రి మార్చేస్తే న‌ల్ల‌ధ‌నం మొత్తం బ‌య‌ట‌ప‌డిపోతుంద‌ని…

దేశం క‌రెన్సీని మార్చేశారు! ప‌న్నులు బాదే తీరును మార్చేశారు! పార్ల‌మెంట్ భ‌వనాన్ని మార్చుకున్నారు! మ‌రి వీటితో సామాన్యుడికి ఒరిగింది ఏమిటి అంటే అదో బ్ర‌హ్మ‌ప‌దార్థం! క‌రెన్సీని రాత్రికి రాత్రి మార్చేస్తే న‌ల్ల‌ధ‌నం మొత్తం బ‌య‌ట‌ప‌డిపోతుంద‌ని చెప్పారు! అలాంటిది జ‌రిగింద‌నే భ్ర‌మ‌ల‌ను భ‌క్తులు ఇప్ప‌టికీ క‌లిగించ‌డానికి ప్ర‌య‌త్నిస్తూ ఉంటారు త‌ప్ప‌, నోట్ల ర‌ద్దుతో న‌ల్ల‌ధ‌నికుల‌కు పోయింది ఏమీ లేదు! దేశంలో అవినీతి ఏర‌కంగానూ త‌గ్గుముఖం ప‌ట్టింది లేదు. నోట్ల ర‌ద్దు త‌ర్వాతి ఎన్నిక‌ల్లో ఓటు రేటు పెరిగిందే త‌ప్ప‌.. త‌గ్గ‌లేదు!

ఇక జీఎస్టీతో అర్ధ‌రాత్రి స్వ‌తంత్రం వ‌చ్చింద‌న్నారు! దీని వ‌ల్ల సామాన్యుడిపై బాదుడు మ‌రింత‌గా పెరిగింది. ప‌న్ను మోసాలు చేసే వాళ్లు ద‌ర్జాగా త‌మ ప‌నితాము చేసుకుంటూ పోతూ ఉన్నారు. చిన్న చిన్న వ్యాపారులు న‌లిగిపోవ‌డ‌మే త‌ప్ప‌.. దోపిడీ వ్యాపారస్తుల‌కు పోయింది లేదు. అదేంటో కానీ.. ఏ ముహూర్తాన జీఎస్టీ తెచ్చారో కానీ అప్ప‌టి నుంచి అన్నింటి ధ‌ర‌లూ ఆకాశ‌మార్గానే ప‌య‌నిస్తూ ఉన్నాయి! ఇక పాత పార్ల‌మెంట్ భ‌వ‌నం స్థానంలో కొత్త భ‌వ‌నాన్ని క‌ట్టుకున్నారు. సంతోషం! దీని వ‌ల్ల ప్ర‌జాస్వామ్యం మ‌న్నిక పెరిగింద‌ని అనుకుందాం!

మ‌రి ఇప్పుడు దేశం పేరును కూడా మార్చేశారో, మ‌రి మార్చేయ‌బోతున్నార‌ట‌! ఈ విష‌యాన్ని కూడా ఏ అర్ద‌రాత్రో ప్ర‌క‌టించి ఉంటే స‌రిపోయేది ష‌డ‌న్ గా. దేశం పేరును మార్చేయ‌డం ఎంత‌టి అవ‌స‌ర‌మో భ‌క్తులు ఆ రాత్రికి రాత్రే వాట్సాప్ పోస్టుల‌ను త‌యారు చేసే వాళ్లు!

భ‌క్తులు, కాషాయ‌ధారులు చాలా యేళ్లుగా ఇండియా అనే పేరు బ్రిటీష్ వాళ్లు ఇచ్చిందంటూ నిర‌స‌న‌లు వాట్సాప్ లో చెబుతూవ‌చ్చారు. ఇండియా అంటే ఇండిపెండెంట్ నేష‌న్ ఇన్ ఆగ‌స్ట్ అట‌! ఆగ‌స్టులో బ్రిటీష్ వాళ్లు ఇండియాకు స్వ‌తంత్రాన్ని ఇచ్చారు కాబ‌ట్టి.. ఇండియా అని పేరు పెట్టి వెళ్లార‌ట‌. కాబ‌ట్టి ఆ పేరును ఉచ్ఛ‌రించ‌డ‌మే త‌ప్ప‌ట‌! ఇదీ భ‌క్తుల వాద‌న‌.

ఇండియా అనే పేరు ఇండ‌స్ వ్యాలీ సివిలైజేష‌న్ నుంచి వ‌చ్చింద‌నే ప్రాథ‌మిక అవ‌గ‌హ‌న కూడా లేకుండా వాట్సాప్ యూనివ‌ర్సిటీ ఇండియా పేరును ఆగ‌స్టులో స్వ‌తంత్రానికి ముడిపెట్టి ప్ర‌చారం చేశారు! మ‌రి ఇప్పుడు మోడీ దేశం పేరును మార్చేస్తే ఇలాంటి కీర్త‌న‌లు మ‌ళ్లీ అందుకుంటారు. మాస్ట‌ర్ స్ట్రోక్ అంటారు. ఇండియాకు భార‌త్ అనే పేరు ఎందుకు ఉండాలో గంట‌ల‌కు గంట‌లు ప్ర‌సంగిస్తారు. హిందుత్వం, మ‌తం అన్నింటితోనూ ముడిపెట్టేసి.. భావోద్వేగాలు రేకెత్తించే ప్ర‌య‌త్నాలూ ప‌తాక స్థాయిలో జ‌రుగుతాయి,

ఎలాగూ ఎన్నిక‌ల‌కు ఇక ఎన్నో నెలల స‌మ‌యం లేదు. ఇలాంటి నేప‌థ్యంలో.. దేశం పేరు మార్పు, రామ‌మందిర నిర్మాణం ఇవే మ‌రోసారి ఓటు అడ‌గానికి మోడీ ప్ర‌యోగించ‌బోయే అస్త్రాల్లాగా ఉన్నాయి. మ‌రి మోడీ నాయ‌క‌త్వంలో ఇండియా పేరు కూడా అంత‌ర్జాతీయ వేదిక‌పై మారిపోతే.. ముచ్చ‌ట‌గా ఉంటుంది.

ప‌దేళ్ల పాల‌న‌లో క‌రెన్సీ మారిపోయింది, ప‌న్ను బాదుడు ప‌ద్ధ‌తి వాడిగా మారింది, పార్ల‌మెంట్ భ‌వ‌నం మారిపోయింది, ఇక దేశం పేరు కూడా మారిపోతే లాంఛ‌నం పూర్త‌వుతుంది. అలాగే బీజేపీ పాల‌న‌లో ఉన్న కొన్ని రాష్ట్రాల్లో ప‌ట్ట‌ణాల‌, న‌గ‌రాల పేర్ల‌ను మార్చేశారు. మారుస్తూ ఉన్నారు! తెలంగాణ‌లో అధికారంలోకి వ‌స్తే హైద‌రాబాద్ పేరు మార్చేస్తామ‌నే హామీ కూడా బీజేపీ వ‌ద్ద ఉంది! మొత్తానికి ప‌దేళ్ల‌లో ఏం సాధించారంటే.. ఇలాంటి మార్పుల‌న్నింటినీ చెప్పుకోవ‌చ్చు. ఇంత‌కు మించి ఏం కావాలి ఓట్ల కోసం?

-హిమ‌