రెండుసార్లు ఎమ్మెల్యే …ప్రశ్నోత్తరాల సమయం అంటే తెలియదా ?

రాజకీయ పార్టీలు ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా అతి చేస్తుంటాయి. పార్టీలు అంటే కొందరు పార్టీ సభ్యులున్న మాట. ప్రతి పార్టీలో భజనపరులు ఉంటారు. వాళ్ళు పదవులకు ఆశపడో, ముఖ్యమంత్రి దృష్టిలో పడాలనో ఓవర్…

రాజకీయ పార్టీలు ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా అతి చేస్తుంటాయి. పార్టీలు అంటే కొందరు పార్టీ సభ్యులున్న మాట. ప్రతి పార్టీలో భజనపరులు ఉంటారు. వాళ్ళు పదవులకు ఆశపడో, ముఖ్యమంత్రి దృష్టిలో పడాలనో ఓవర్ యాక్షన్ చేస్తుంటారు. 

ఆ ఓవర్ యాక్షన్ కు సమయం, సందర్భం ఉండదు. నిబంధనలు పట్టించుకోరు. ఏ సమయంలో ఏ మాట్లాడాలో తెలియదు. ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియదు. భజన చేయడం మొదలు పెడితే ఇక అంతే… వీర భజనే. ఆగమన్నా ఆగరు. 

వైసీపీలో ఉన్న వీర భజనపరుల్లో నగరి ఎమ్మెల్యే రోజాకు అగ్రస్థానం ఇవ్వాల్సిందే. నిన్న అసెంబ్లీలో చేసింది వీరభజనో, చెక్క భజనో అర్ధం కావడంలేదు. ఆమె రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యింది. మొదటిసారి గెలిచినప్పుడు ప్రతిపక్షంలో ఉంది. అప్పుడు ఆమె అధికార పార్టీ మీద, ప్రభుత్వం మీద చేసిన విమర్శల గురించి, ఆరోపణల గురించి, మాట్లాడిన బూతుల గురించి చెప్పనలవికాదు. 

ఇప్పుడు అధికారపక్షంలో ఉంది. దీంతో భజన చేస్తోంది. దీన్ని భజన అనడం కంటే ఓవర్ యాక్షన్ అంటే సరిగ్గా ఉంటుంది. రోజా అధికార పార్టీ ఎమ్మెల్యే కాబట్టి భజన చేయక తప్పదు. అది ఆమె ఇష్టం. కానీ భజన చేయడానికి ఒక సమయం ఉంటుంది. సందర్భం ఉంటుంది.

ప్రశ్నోత్తరాల సమయంలో ప్రజా సమస్యలపై మంత్రులను ప్రశ్నలు అడగకుండా సుదీర్ఘంగా సీఎం జగన్ స్తోత్రం చేసింది. జగన్ పథకాలను పొగుడుతూ వాటివల్ల మహిళలు ఎలా బాగుపడ్డారో చెప్పింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును 420 అన్నది. జగన్ వంటి ముఖ్యమంత్రి దేశం మొత్తం మీద లేడని చెప్పింది.

పాపం … స్పీకర్ తమ్మినేని భజన ఆపాలని అనేకసార్లు బిల్లు మోగించిన రోజా నవ్వుకుంటూ తుళ్ళుకుంటూ వీరలెవెల్లో భజన కొనసాగించింది. స్పీకర్ ఎలాగోలా కలుగజేసుకొని ఇది ప్రశ్నోత్తరాల సమయమని, కాబట్టి ప్రశ్నలు అడగాలని, ఇలా భజన చేయాలంటే వేరే మార్గాలున్నాయని  చెప్పారు.

జగన్ పరిపాలనలో ప్రశ్నలు అడిగే అవసరం రావడంలేదని, ఆయన నాయకత్వంలో మంత్రులు ప్రశ్నలు అడిగే అవసరం రాకుండా పనిచేస్తున్నారని సంతోషంగా చెప్పింది. కేవలం భజన చేయడం కోసమే రోజా హైదారాబాద్ నుంచి అమరావతికి వచ్చి అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటున్నట్లుగా అనిపిస్తోంది. డిశంబరులో మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉంటాయంటున్నారు. మంత్రివర్గంలో అవకాశం కోసమే రోజా సుదీర్ఘ భజన చేసి ఉండొచ్చు.