పాల‌న‌లో జ‌గ‌న్ ఘోర వైఫ‌ల్యం

త‌న మిత్రుడి కుమారుడు వైఎస్ జ‌గ‌న్ పాల‌న‌పై మాజీ ఎంపీ, సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కుడు ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. జ‌గ‌న్‌పై ఎప్పుడూ ప్రేమ క‌న‌బ‌రిచే ఉండ‌వ‌ల్లి… ఇటీవ‌ల కాలంలో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న…

త‌న మిత్రుడి కుమారుడు వైఎస్ జ‌గ‌న్ పాల‌న‌పై మాజీ ఎంపీ, సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కుడు ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. జ‌గ‌న్‌పై ఎప్పుడూ ప్రేమ క‌న‌బ‌రిచే ఉండ‌వ‌ల్లి… ఇటీవ‌ల కాలంలో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న సంగ‌తి తెలిసిందే. విమ‌ర్శ‌ల తీవ్ర‌త క్ర‌మంగా పెంచుతుండ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. ఇవాళ రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఉండ‌వ‌ల్లి ఏపీ రాజ‌కీయ ప‌రిస్థితిపై ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

దాదాపు 30 ఏళ్ల పాటు పాల‌న సాగించాల‌నే ఆశ‌యంతో అధికారంలోకి వ‌చ్చిన జ‌గ‌న్ పాల‌న‌ను చూస్తుంటే… ఇంత ఘోరంగా ఉంటుంద‌ని తానెప్పుడూ అనుకోలేద‌న్నారు. జగన్‌ ప్రభుత్వంలో అవినీతి రాజ్యమేలుతోందని ఉండ‌వ‌ల్లి ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్  బాగా పరిపాలన సాగిస్తున్నారని ప్ర‌శంసించారు. జగన్ మాత్రం ఈ రెండేళ్లలోనే ఘోరంగా విఫలమయ్యారని ఉండవల్లి చెప్పుకొచ్చారు.  

ఇసుక, మద్యం, పెట్రోల్‌, కరెంట్‌..ఇలా అన్ని ధరలు పెంచుకుంటూ పోయారన్నారు. మ‌రో వైపు అప్పులూ పెరుగుతున్నాయ‌న్నారు.  ఉన్నన్నాళ్లు అప్పులపై నెట్టుకొచ్చి ఆ తర్వాత రాష్ట్రాన్ని రోడ్డుపై పడేయడమే వైసీపీ ఉద్దేశంగా క‌నిపిస్తోంద‌ని తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. 

రాష్ట్రానికి  రావాల్సిన నిధులపై కేంద్రాన్ని అడిగే ద‌మ్ము లేద‌న్నారు. ఇటీవ‌ల కాలంలో కొంత మంది ఐఏఎస్ అధికారుల‌ను రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితిపై విచారించ‌గా…ఇలాంటి ప‌రిస్థితి తామెప్పుడూ చూడ‌లేద‌ని చెబుతున్నార‌న్నారు. ఆకాశం వైపు చూపుతున్నార‌ని, అంటే దేవుడే కాపాడాల‌ని అంటున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.  

పోల‌వ‌రం ప్రాజెక్ట్ పూర్త‌యి, పొలాల‌న్నీ స‌స్య‌శ్యామ‌లం అవుతాయ‌ని, పంట‌ల దిగుబ‌డితో రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి మెరుగు ప‌డుతుంద‌ని ఆశించాన‌న్నారు. కానీ పోల‌వ‌రం పూర్త‌య్యే ప‌రిస్థితి కాన‌రాలేద‌న్నారు. పోల‌వ‌రంపై తాము కోర్టులో కేసు వేశామ‌ని, రెండేళ్లుగా క‌నీసం అఫిడ‌విట్ దాఖ‌లు చేసే స్థితిలో కూడా ఏపీ ప్ర‌భుత్వం లేద‌ని విమ‌ర్శించారు. రాష్ట్ర ప్ర‌భుత్వం అఫిడ‌విట్ వేస్తే… కోర్టే కేంద్రాన్ని ప్ర‌శ్నిస్తుంద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు.

ప్రభుత్వానికి అప్పులపై నియంత్రణ లోపించిందని ఆయన విమ‌ర్శిం చారు. ఏపీ 6 లక్షల 22 వేల కోట్లు అప్పుల్లో ఉంద‌న్నారు. జగన్ వచ్చాక 3 లక్షల 50 వేల కోట్లు అప్పులు చేశారుర‌న్నారు. కేంద్రం నుంచి నిధులు తీసుకురాలేమని ముఖ్యమంత్రి జగన్ మొద‌ట్లోనే చెప్పార‌న్నారు.