తన సతీమణి భువనేశ్వరిని వైసీపీ ప్రజాప్రతినిధులు నిండు చట్టసభలో అవమానించారంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు వెక్కివెక్కి ఏడ్వడంపై సీనియర్ రాజకీయవేత్త ఉండవల్లి అరుణ్‌కుమార్ సీరియస్ కామెంట్స్ చేశారు. రాజమండ్రిలో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ అనేక అంశాలపై వివరంగా, విమర్శనాత్మకంగా మాట్లాడారు.
సహజంగా రాజకీయ, సినీరంగ ప్రముఖుల పిల్లలపై రకరకాల ప్రచారాలు జరుగుతుంటాయన్నారు. కానీ ఎన్టీఆర్ పిల్లలపై అలాంటి ప్రచారాలను తాను, తన స్నేహితులు ఏనాడూ వినలేదన్నారు. అలాంటిది అసెంబ్లీలో ఎవరో ఏదో అన్నారని చంద్రబాబు వెక్కివెక్కి ఏడ్వడం ఏంటని ఉండవల్లి ప్రశ్నించారు.
జగన్ పాలనా ఫెయిల్యూర్స్‌పై ప్రతిపక్షంగా టీడీపీ అసెంబ్లీలో నిలదీస్తుందని తాను భావించానన్నారు. అలాంటిది అసెంబ్లీని బహిష్కరించి టీడీపీ ప్రతిపక్షంగా విఫలమైందన్నారు.
ఎక్కడైనా తప్పుల్ని కప్పి పుచ్చుకునేందుకు పాలక పక్షం డైవర్ట్ పాలిటిక్స్ చేస్తుంటుందని, కానీ ఇక్కడ ఆ పని టీడీపీ ఎందుకు చేసిందో తనకు అర్థం కావడం లేదన్నారు. ఎన్టీఆర్ పిల్లల్లో హరికృష్ణ, పురందేశ్వరితో తనకు బాగా పరిచయమన్నారు. వాళ్లు తనతో అభిమానంగా మాట్లాడేవారన్నారు. వాళ్లిద్దరూ మంచి వాళ్లని చెప్పుకొచ్చారు.
ఎన్టీఆర్ పిల్లల గురించి అందరికీ తెలుసని, అలాంటిది వాస్తవం లేని దాని గురించి చంద్రబాబు ఎందుకో ఎక్కువ బాధ పడ్డారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇలా చేయడం వల్ల సింపతీ రాదని బాబుకు తెలియదా? అని ప్రశ్నించారు.
ఎందుకంటే అలిపిరి ఘటనలో రక్తపు మడుగులో నుంచి వచ్చిన చంద్రబాబుపై నాడు సింపతీ లేదన్నారు. ఈ సందర్భంగా ఇందిరా హత్యానంతరం ఏపీలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌పై సింపతీ లేదని రుజువైందన్నారు. ఒక్క రాజీవ్ హత్య మాత్రం కొంత సింపతీ క్రియేట్ చేసిందన్నారు.
అలాగే వైఎస్సార్ మరణం కూడా జగన్‌పై సింపతీ తీసుకురాలేదన్నారు. చంద్రబాబుకు కూడా ఆయన ఏడ్పు ఎంత మాత్రం సింపతీ తీసుకురాదని కుండబద్దలు కొట్టారు.