తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై రాజన్న తనయ, వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేసింది. ట్విటర్ వేదికగా కేసీఆర్పై ఆమె విరుచుకుపడ్డారు. నిరుద్యోగులకు నోటిఫికేషన్ లేకపోవడంతో పాటు తన బిడ్డకు రెండోసారి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడాన్ని షర్మిల తప్పు పట్టారు. రోజుకొక నిరుద్యోగి చనిపోతుంటే మాత్రం దొరకు కనపడడం లేదని … తెలంగాణ యాసలో షర్మిల వ్యంగ్యాస్త్రాలు విసిరారు.
కాసేపటి క్రితం ఒకే అంశంపై రెండు ట్వీట్లు చేయడం విశేషం. కేసీఆర్ను టార్గెట్ చేస్తూ షర్మిల చేసిన ట్వీట్లు ఏంటో చూద్దాం.
“ఒక్క నెలలోనే ఆరుగురు నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నానోటిఫికేషన్స్ ఇవ్వాలనే సోయి లేదు దొరకు. నిరుద్యోగులను బలితీసుకొంటున్న హంతకుడు కేసీఆర్. ఇంకెంత మందిని బలితీసుకొంటే ఉద్యోగాలు ఇస్తారు సారూ? నీ బిడ్డలే బిడ్డలు కానీ ఇతరుల బిడ్డలు బిడ్డలు కాదా? వాళ్ళ ప్రాణాలు నీకు లెక్కలేదా?”
“బిడ్డ ఒక్కసారి ఎన్నికల్లో ఓడిపోతేనే కేసీఆర్ గుండె తల్లడిల్లింది. బిడ్డకు రెండుసార్లు MLC, ఇప్పుడు మంత్రి పదవి కట్టబెట్టేం దుకు రెడీగా ఉన్నాడు. నోటిఫికేషన్స్ లేక, ఉద్యోగాలు రాక పురుగులమందు తాగుడు, ఉరి వేసుకొనుడే ఉద్యోగంగా రోజుకొక్క నిరుద్యోగి చస్తుంటే మాత్రం దొరకు కనపడుతలేదు”
కేసీఆర్ను దొర అని సంబోధిస్తూ తీవ్ర వ్యాఖ్యలతో షర్మిల ఆగ్రహాన్ని ప్రదర్శించడాన్ని గమనించొచ్చు. తన కూతురు కవితకు రెండోసారి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టడంతో పాటు మంత్రి పదవి ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాడంటూ దెప్పి పొడిచారు. షర్మిల ఘాటు వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.