వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డిని ఎలాగైనా తమ పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ గట్టి పట్టుదలతో వుంది. రానున్న రోజుల్లో ప్రత్యామ్నాయ పార్టీగా బీజేపీ ఎదగాలనే ఆలోచనతో వుంది. ఈ నేపథ్యంలో ప్రజాదరణ కలిగిన నేతల కోసం ఆ పార్టీ అన్వేషిస్తోంది. తెలంగాణలో బీజేపీ నెమ్మదిగా బలపడుతోంది. బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీనే అనే స్థాయికి ఎదిగింది. తెలంగాణలో బలమైన నేతలంతా బీజేపీ వైపు ఆకర్షితులవడంతో అనతికాలంటోనే కేసీఆర్‌ను ఢీకొనే స్థాయికి ఆ పార్టీ చేరుకుంది.
దీంతో ఏపీ బీజేపీపై ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో టీడీపీ, వైసీపీలలో అసంతృప్త నాయకుల్ని తమ వైపు తిప్పుకునేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. ఇటీవల వైసీపీ ఆగ్రహానికి గురైన ఆనం రామనారాయణరెడ్డిపై బీజేపీ దృష్టి పడింది. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ఆనంను చేర్చుకోవడం ద్వారా నెల్లూరులో బీజేపీ బలపడే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతోంది. నెల్లూరు జిల్లా బాధ్యతల్ని అప్పగించడంతో పాటు రాష్ట్రస్థాయిలో తగిన ప్రాధాన్యం ఇస్తామని బీజేపీ నేతలు హామీ ఇస్తున్నారని తెలిసింది.
ఆనం గురించి జాతీయస్థాయి నాయకులు ఆరా తీస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. రామనారాయణ రెడ్డిని పార్టీలో చేర్చుకోవడం ద్వారా నెల్లూరు సిటీ, రూరల్, ఆత్మకూరు, వెంకటగిరి నియోజకవర్గాల్లో బీజేపీ బలపడే అవకాశం ఉన్నట్టు ఆ పార్టీ నేతలు నమ్ముతున్నారు. దీంతో ఆనం రామనారాయణరెడ్డిని ఎలాగైనా బీజేపీలో చేర్చుకునేందుకు సంప్రదింపులు జరపాలని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజుకు అధిష్టానం బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం. మరోవైపు ఆర్ఎస్ఎస్ నేతలు కూడా ఆనం కోసం పట్టు పడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు భవిష్యత్ కార్యాచరణపై ఆనం తన సన్నిహితులతో చర్చిస్తున్నారు.
టీడీపీ, జనసేన, బీజేపీలలో ఏ పార్టీని ఎంచుకుంటే భవిష్యత్ బాగుంటుందనే సమాలోచనలు ఆనం జరుపుతున్నారు. అనేక సందర్భాల్లో ఆనం గురించి పవన్ కల్యాన్ సానుకూల ధోరణిలో మాట్లాడిన సంగతి తెలిసిందే. దీంతో జనసేన నుంచి కూడా ఆయనకు ఆఫర్లు వస్తున్నట్టు సమాచారం.
ఎన్నికలకు ఇంకా ఏడాదికి పైగా సమయం వుండడంతో తొందరపడకూడదనే ఆలోచనలో ఆనం ఉన్నారు. సరైన నిర్ణయం తీసుకోకపోతే రాజకీయంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందనే భయం ఆనం రామనారాయణరెడ్డిని వెంటాడుతోంది. తనతో పాటు వారసులు, అనుచరుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ఆయన ఏ పార్టీలో చేరాలనే విషయమై నిర్ణయం తీసుకోనున్నారు.