చిన్న సినిమాలు ఇక చిన్న చూపేనా?

ప్రేక్షకుల అభిరుచి మారుతోంది.ఎలా మారుతోంది..ఎటు టర్న్ తీసుకుంటొంది అన్నది టాలీవుడ్ జ‌నాలకు అంతు పట్టడం లేదు. జాతిరత్నాలు..డిజె టిల్లు లాంటి చిన్న సినిమాలు కోట్లు కురిపించేసరికి ఇది కదా రూటు అనుకున్నారు. కానీ చిన్న…

ప్రేక్షకుల అభిరుచి మారుతోంది.ఎలా మారుతోంది..ఎటు టర్న్ తీసుకుంటొంది అన్నది టాలీవుడ్ జ‌నాలకు అంతు పట్టడం లేదు. జాతిరత్నాలు..డిజె టిల్లు లాంటి చిన్న సినిమాలు కోట్లు కురిపించేసరికి ఇది కదా రూటు అనుకున్నారు. కానీ చిన్న బ్యానర్లకు ఆ ఫీట్ సాధ్యం కాదని కేవలం పెద్ద బ్యానర్లు తీసే చిన్న సినిమాలకే అది ఓ అవకాశం అని అనుకున్నారు తరువాత. 

అయితే అంతలోనే మైత్రీ, గీతా, యువి, ఇలా చాలా పెద్ద బ్యానర్ల నుంచి వచ్చిన సినిమాల వాసన కూడా చూడలేదు పేక్షకులు. ఓ రేంజ్ దర్శ‌కుడు అనుకున్న మారుతి తీసిన మంచి రోజులు వచ్చాయి సినిమాకు గీతా, యువి లాంటి రెండు బ్యానర్లు సాయం పట్టినా, పరమ డిజాస్టర్ అయిపోయింది.

ఇలాంటి టైమ్ లో ప్రేక్షకులు కొత్త దనం కోరుకుంటున్నారు. కెజిఎప్, విక్రమ్ లాంటి స్టయిలిష్ యాక్షన్ సినిమాలు ఆడడం ప్రారంభించాయి. దాంతో జ‌నం ఇక రెగ్యులర్ రొటీన్ ఫార్మాట్ సినిమాలు చూడరు అని మరో ఆలోచన ప్రారంభమైంది. అలాంటి టైమ్ లో బ్యాక్ టు బ్యాక్ నాలుగు సూపర్ హిట్ లు పడ్డాయి. కార్తికేయ 2, ధమాకా, వాల్తేర్ వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలు. వీటిలో కార్తికేయ 2 ఒక్కటే కాస్త వైవిద్యమైన సినిమా. మిగిలిన మూడూ పక్కా రెగ్యులర్ ఫార్మాట్ సినిమాలు. 

ఇలాంటి సినిమాలు తీస్తే జ‌నం చూడరు. ఇలాంటి సినిమాలకు కాలం చెల్లింది అని అనుకుంటున్న టైమ్ లో ఇవి హిట్ కావడం నిర్మాతలను మళ్లీ ఆలోచనలో పడేసింది. అంతే కాదు. మంచిగా బాగుంది అన్న టాక్ వచ్చినా, బాగా ప్రచారం సాగించినా, సోషల్ మీడియా హోరెత్తినా రైటర్ పద్మభూషణ్ కు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా కలెక్షన్లు రావడం లేదు.

విక్రమ్..కేజిఎఫ్ సిరీస్ లను చూసి, అలాగే మైఖేల్ అనే సినిమాను సందీప్ కిషన్ తో తీస్తే రిజ‌ల్ట్ తేడా కొట్టింది. సినిమా టేకింగ్, టెక్నికల్ వాల్యూస్ బాగానే వున్నాయి. కానీ మిస్ కాస్టింగ్ అయింది..సందీప్ కాకుండా మరెవరైనా పెద్ద హీరో అయితేనా? అన్న టాక్ మొదలైంది. ఇది కూడా మరో కోణం.

అంటే ఇప్పుడు తెలుగు సినిమా పెద్ద ధ‌ర్మ సందేహం లో చిక్కుకుంది. ఏదో అద్భుతం జ‌రిగితే తప్ప చిన్న సినిమాల మీద ఆసక్తి రావడం లేదు. చిన్న కాస్టింగ్ సరిపోవడం లేదు. నీట్ గా క్లీన్ గా తీసినా జ‌నానికి పెద్దగా పట్టడం లేదు. పెద్ద హీరోలు రెగ్యులర్ ఫార్మాట్ సినిమాలు తీసినా చూస్తున్నారు. పక్క భాషల్లో చేసిన డార్క్ థీమ్ ప్రయోగాలు మన దగ్గర చేయాలంటే టాప్ హీరోలే కావాలి.

ఇలాంటి టైమ్ లో మిడ్ రేంజ్, స్మాల్ రేంజ్ హీరోలు ఏం చేయాలి? అదే రేంజ్ నిర్మాతలు ఏం చేయాలి? పోటీ ఓటిటీ కేసి చూద్దామా అంటే వాళ్లు కూడా ఈ రేంజ్ సినిమాలు కొనడం లేదు. కొన్నా మంచి రేటు ఇవ్వడం లేదు. చూస్తుంటే 2024 వచ్చేసరికి తెలుగు సినిమా లో పెను మార్పులు వచ్చేలా కనిపిస్తోంది. అదృష్టం బాగోకుండా చిన్న, మిడ్ రేంజ్ హీరోలు మెల్లగా కనుమరుగు అయ్యే ప్రమాదం కనిపిస్తోంది. లేదూ అంటే వీళ్లు..వాళ్లు కలగలిసిన మల్టీ స్టారర్ లే వారి కెరీర్ కు అండగా వుండే పరిస్థితి కనిపిస్తోంది.