Advertisement

Advertisement


Home > Politics - National

షాకింగ్.. ఈ ఎంపీల ఆస్తులు 286 శాతం పెరిగాయి!

షాకింగ్.. ఈ ఎంపీల ఆస్తులు 286 శాతం పెరిగాయి!

ఫలానా వ్యాపారవేత్త ఆదాయం 20 శాతం పెరిగింది, ఫలానా సంస్థ ఆదాయం 100 శాతం పెరిగిందని అందరూ ఆశ్చర్యంగా చెప్పుకుంటారు. కానీ భారత్ లో 71మంది ఎంపీల సగటు ఆదాయం ఏకంగా 286 శాతం పెరగడం ఇక్కడ విశేషం. ఆ 71మంది ఫోర్బ్స్ జాబితాకి అందని కోటీశ్వరులు. వ్యాపారులు సైతం తమ ఆస్తుల్ని ఎలా పెంచుకోవాలా అని తలమునకలవుతున్న దశలో.. కోట్ల ఆస్తుల్ని కూడగట్టి అందరికీ షాకిచ్చిన మహానుభావులు ఈ ఎంపీలు. రెండుసార్లు పార్లమెంట్ కి ఎంపికయ్యారో లేదో.. తరతరాలకు సరిపడా ఆస్తిని కూడబెట్టారు, కూడబెడుతూనే ఉన్నారు.

అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ADR) సంస్థ విడుదల చేసిన జాబితా ప్రకారం ఆ 71మంది ఏ స్థాయిలో సంపాదించారో బయటపడింది. 2009, 2019 మధ్య కాలంలో వీరంతా ఎంపీలుగా రెండుసార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. వీరందరిలో దేశముదురు బీజేపీ ఎంపీ రమేష్ చందప్ప జిగజినాగి.

2009లో తొలిసారి అతను లోక్ సభకు పోటీ చేసినప్పుడు ఎన్నికల అఫిడవిట్ లో పొందుపరిచిన ఆస్తి కేవలం 1.18 కోట్ల రూపాయలు. 2014 ఎన్నికలనాటికి ఆ ఆస్తి రూ.8.94కోట్లకు చేరింది. 2019 ఎన్నికలనాటికి ఏకంగా 50.41కోట్లకు చేరుకుంది. కేవలం అఫిడవిట్ లో చూపించిన ఆస్తి ఇది. కర్నాటకలోని బీజాపూర్ నుంచి గెలిచిన ఈ బీజేపీ ఎంపీ, అతి తక్కువ సమయంలో ఎక్కువ ఆస్తి కూడబెట్టిన ఎంపీగా రికార్డ్ సృష్టించారు. గతంలో ఆయన కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. కానీ మనోడి టాలెంట్ చూసి మోదీ ప్రస్తుతం పక్కనపెట్టారు.

బెంగళూరు బాబులే  ఎక్కువ..

ఆస్తులు కూడబెట్టడంలో నెంబర్-2 స్థానంలో ఉన్నది కూడా కర్నాటక వాసే కావడం విశేషం. బెంగళూరు సెంట్రల్ లోక్ సభ స్థానం నుంచి గెలిచి పీసీ మోహన్, 2009లో తనకు 5.37కోట్ల రూపాయల ఆస్తి ఉందని అఫిడవిట్ సమర్పించారు. 2019నాటికి ఆస్తి విలువ 75.55కోట్లకు చేరుకుంది. యూపీలోని ఫిలిభిత్ నియోజకవర్గం నుంచి ఎన్నికైన వరుణ్ గాంధీ ఆస్తుల విలువ కూడా పదేళ్లలో రూ.4.92 కోట్ల నుంచి 60.32 కోట్ల రూపాయలకు పెరిగింది.

ఆడాళ్లా మజాకా..

పదేళ్ల కాలంలో కొంతమంది మహిళా ఎంపీల ఆస్తులు కూడా గుట్టలు గుట్టలుగా పెరిగాయి. హర్ సిమ్రత్ కౌర్ బాదల్, సుప్రియా సూలే.. సహా మరికొందరు కూడా ఈ 71ఎంపీల లిస్ట్ లో ఉన్నారు. వీరంతా పదేళ్ల కాలంలోనే తమ ఆస్తుల్ని కళ్లుచెదిరే రేంజ్ లో పెంచుకున్నారు.

మొత్తం 71మంది ఎంపీల ఆస్తుల విలువ 10ఏళ్ల కాలంలో భారీగా పెరిగింది. 2009లో వారి సగటు ఆస్తి విలువ 6.15 కోట్లు కాగా, ఇప్పుడది 17.59కోట్లకు చేరుకుంది. అంటే కేవలం ఈ 71 మంది ఎంపీల ఆస్తుల విలువే 286 శాతం పెరిగిందనమాట. 

ఇవన్నీ అఫిడవిట్ లెక్కలు మాత్రమే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక మిగతా రాజకీయనాయకుల ఆస్తులు కూడా కలుపుకుంటే, మనమే అమెరికాకు అప్పు ఇవ్వొచ్చేమో. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?