“చిరంజీవి గారు నా గుండె లోతుల్లో ఉంటారు. వీణ స్టెప్ నుంచి చిరంజీవికి హార్డ్ కోర్ ఫ్యాన్ అయ్యాను. నా గుండెలో కొంతభాగం మహేష్ సొంతం. బాలయ్యపై నాది నిజమైన ప్రేమ, నేను చివరి వరకు ఆయన అభిమానిని. చిన్నప్పట్నుంచి పవన్ కల్యాణ్ ఫ్యాన్ ని నేను. రవితేజ అంటే నాకు ఎంతిష్టమంటే.. అమ్మా-నాన్న-రవితేజ అంటాను నేను. చాలామందిలా నేను ప్రభాస్ కి వీరాభిమానిని. నా కుటుంబంతో పాటు నేను కూడా నాగార్జున అభిమానిని. బన్నీ అంటే ఎంతిష్టమంటే, నాకు కలలొస్తాయి, అందులో హీరో బన్నీ. నిద్రలో లేపి అడిగినా నేను ఎన్టీఆర్ ఫ్యాన్ అంటాను.”
పవన్, ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ అభిమానులు విడివిడిగా ఇచ్చే స్టేట్ మెంట్స్ ఇలానే ఉంటాయి. అయితే పైన మనం చెప్పుకున్న స్టేట్ మెంట్స్ అన్నీ ఆయా హీరోల అభిమానులు ఇచ్చినవి కావు, ఒకే ఒక్కడు ఇచ్చిన స్టేట్ మెంట్స్ అవి. అతడే తమన్.
అవును.. తమన్ ఏ హీరో ఫ్యాన్ అనే డిస్కషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో మొదలైంది. అయితే సీరియస్ గా కాదు, ఆ చర్చ మొత్తం చాలా సరదాగా నడుస్తోంది.
రీసెంట్ గా ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు తమన్. అందులో టాలీవుడ్ హీరోల గురించి మాట్లాడుతూ.. ప్రతి హీరోను పొగిడేశాడు. ఆ ఇంటర్వ్యూలో క్లిప్స్ అన్నింటినీ కట్ చేసి 'తమన్ ఎవరి ఫ్యాన్' అనే ఫన్నీ డిస్కషన్ కు తెరలేపారు కొంతమంది నెటిజన్లు.
దీంతో గతంలో తమన్ మాట్లాడిన ఇతర వీడియోలు కూడా నెట్టింట ప్రత్యక్షమౌతున్నాయి. అవన్నీ కలిపి చూస్తే నవ్వు ఆపుకోవడం కాస్త కష్టమైన వ్యవహారమే. అందుకే ఇది కామెడీ డిస్కషన్ గా మారింది.
మీడియా ముందు మాట్లాడాల్సి వచ్చినప్పుడు లేదా నిండు సభలో ప్రసంగించాల్సి వచ్చినప్పుడు అక్కడే ఉన్న హీరోను పొగడ్డం పరిపాటి. కాకపోతే తమన్ ఇంకాస్త ఎక్కువ మసాలా దట్టిస్తాడు, మరికాస్త ఆవేశాన్ని దానికి జోడిస్తాడు. అక్కడే వచ్చింది చిక్కంతా.