పరుపు స్వాహా.. ఇదో కొత్త రకమైన జబ్బు

గోళ్లు కొరుక్కుని తినడం కొంతమందికి హాబీ, కొంతమంది తలలో వెంట్రుకలు అప్పుడప్పుడు లాగించేస్తుంటారు, మట్టితింటారు కొందరు, గాజుపెంకుల్ని నంచుకుంటారు ఇంకొందరు. ఇలాంటి వారి గురించి చాలాసార్లు విన్నాం, చూశాం, కానీ అమెరికాలోని జెన్నిఫర్ అనే…

గోళ్లు కొరుక్కుని తినడం కొంతమందికి హాబీ, కొంతమంది తలలో వెంట్రుకలు అప్పుడప్పుడు లాగించేస్తుంటారు, మట్టితింటారు కొందరు, గాజుపెంకుల్ని నంచుకుంటారు ఇంకొందరు. ఇలాంటి వారి గురించి చాలాసార్లు విన్నాం, చూశాం, కానీ అమెరికాలోని జెన్నిఫర్ అనే మహిళ ఇంకాస్త వెరైటీ.

ఈమె ఏకంగా పరుపులు తినేస్తుంది. పరపరా నమిలేస్తుంది. వాటి టేస్టే వేరు అని చెబుతుంది జెన్నిఫర్. కాసేపు వాటిని వాసన చూసి హాయిగా ఆస్వాదించి మరీ పరుపులోని స్పాంజ్ ని నమిలేసి మంచినీళ్లు తాగేస్తుంది జెన్నిఫర్.

ఎలా అలవాటైందంటే..

జెన్నిఫర్ కి ఈ అలవాటు 20ఏళ్లుగా ఉంది. ఆమెకు ఐదేళ్ల వయసున్నప్పుడు ఆమె తండ్రికి ఓ కారు ఉండేది. ఆ కారులో సీట్లకు రంధ్రాలు పడి స్పాంజ్ బయటకు వచ్చేదట. దాన్ని చూసి సరదా పడి నోట్లో వేసుకుంది జెన్నిఫర్. ఆ రుచి నచ్చి ఇప్పటివరకు అలాంటి స్పాంజ్ లను వదిలిపెట్టకుండా తింటోంది. మెల్లమెల్లగా స్పాంజ్ కుషన్ల నుంచి ఇప్పుడు పరుపుల వరకు వచ్చింది జెన్నిఫర్ వ్యవహారం. 20 ఏళ్లలో ఆమె 8 పరుపుల్ని శుభ్రంగా లాగించేసింది.

ప్రస్తుతం జెన్నిఫర్ బెడ్ రూమ్ లో పరుపు లేదు, పూర్తిగా దాన్ని స్వాహా చేసిన తర్వాత ఇప్పుడు ఆమె తల్లి బెడ్ రూమ్ నుంచి స్పాంజ్ ముక్కల్ని తీసుకొచ్చి నమిలేస్తోంది. రోజుకి ఒక చదరపు అడుగు మేర స్పాంజ్ ముక్కల్ని ఇష్టంగా తినగలదు జెన్నిఫర్. ఈ వింత అలవాటుతో ఆమెకు సైడ్ ఎఫెక్ట్స్ ఏవీ రాలేదని తెలుస్తోంది.

అయితే ఆమె స్థూలకాయురాలు. భారీకాయంతో కనిపించే జెన్నిఫర్ మెత్తగా ఉండే పరుపుల్ని చూస్తే దానిపై కూర్చోవడమే కాదు, కింద చేయి పెట్టి కాస్తంత స్పాంజ్ ముక్కను లాగి, నోట్లో వేసుకుని చప్పరిస్తుంది. పరుపును ఫ్రెష్ గానే తినాలంటోంది జెన్నిఫర్, స్పాంజ్ ముక్కపై జామ్, సాస్ లాంటివి వేస్తే టేస్ట్ మారిపోతుందని సలహాఇస్తోంది.