తిరుప‌తి ఎంపీని ఎన్నిచోట్ల నిల‌బెడ్తార‌య్యా….!

ఎన్నిక‌లకు మ‌రో 15 నెల‌ల గ‌డువు వుంది. దీంతో పాల‌క ప్ర‌తిప‌క్ష పార్టీల త‌ర‌పున అభ్య‌ర్థులెవ‌రనే విష‌య‌మై పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. అస‌లు టికెట్లు ద‌క్కేదెవ‌రికి? ద‌క్క‌నిది ఎవ‌రికి అనే విష‌య‌మై టీ…

ఎన్నిక‌లకు మ‌రో 15 నెల‌ల గ‌డువు వుంది. దీంతో పాల‌క ప్ర‌తిప‌క్ష పార్టీల త‌ర‌పున అభ్య‌ర్థులెవ‌రనే విష‌య‌మై పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. అస‌లు టికెట్లు ద‌క్కేదెవ‌రికి? ద‌క్క‌నిది ఎవ‌రికి అనే విష‌య‌మై టీ అంగ‌ళ్ల వ‌ద్ద కూడా విశ్లేష‌ణ‌లు చేస్తూ, మ‌రీ నిర్ధారిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో తిరుప‌తి ఎంపీ డాక్ట‌ర్ గురుమూర్తి విష‌య‌మై పెద్ద ఎత్తున మాట్లాడుకుంటున్నారు. తిరుప‌తి ఎంపీగా త‌న ప‌ని తాను చేసుకుపోతూ, వివాద ర‌హితుడిగా పేరొందిన ఆయ‌న్ను ఏకంగా మూడు అసెంబ్లీ నియోజ‌క వ‌ర్గాల్లో నిలుపుతున్నారు.

తిరుప‌తి పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో సూళ్లూరుపేట‌, స‌త్య‌వేడు, గూడూరు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు ఎస్సీ రిజ‌ర్వ్‌డ్‌. ఈ మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ డాక్ట‌ర్ గురుమూర్తిని వైసీపీ అభ్య‌ర్థిగా ప్ర‌చారం నిలుపుతున్నార‌నే ప్ర‌చారం విస్తృతంగా సాగుతోంది. దీంతో సంబంధిత నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు ఆయ‌న ద‌గ్గ‌రికి భారీగా వెళుతున్నారు. అలాగే ప‌లువురు ఆయ‌న‌కు ఫోన్ చేసి… ఈ విష‌య‌మై ఆరా తీస్తున్న‌ట్టు స‌మాచారం.

ఇదెక్క‌డి గొడ‌వ స్వామి అని గురుమూర్తి త‌ల‌ప‌ట్టుకునే ప‌రిస్థితి. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ త‌న‌కు తిరుప‌తి ఎంపీగా అవ‌కాశం క‌ల్పించార‌ని, ప్ర‌జాప్ర‌తినిధిగా త‌న‌కు అప్ప‌గించిన బాధ్య‌త‌ల్ని స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌ర్తించ‌డం త‌ప్ప‌, మ‌రేమీ తెలియ‌ద‌ని ఆయ‌న చెప్పుకోవాల్సిన ప‌రిస్థితి. మ‌ళ్లీ తిరుప‌తి ఎంపీగా ఆయ‌నే నిల‌బ‌డ‌తార‌ని వైసీపీ అధిష్టానం పెద్ద‌లు చెబుతున్న మాట‌. 

తిరుప‌తి పార్ల‌మెంట్ ప‌రిధిలో ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌స్తుతం ఉన్న ఎమ్మెల్యేల‌పై అసంతృప్తి కార‌ణంగా డాక్ట‌ర్ గురుమూర్తి పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంద‌ని స‌మాచారం. ఏది ఏమైనా ఒక‌టికి మూడు చోట్ల డాక్ట‌ర్ గురుమూర్తి అభ్య‌ర్థిత్వంపై ప్ర‌చారం జ‌ర‌గ‌డం రాజ‌కీయంగా ఆస‌క్తి క‌లిగించే అంశం. గెలిచినా, ఓడినా తిరుప‌తి లోక్‌స‌భ స్థానం నుంచి ఆయ‌న పోటీ ప‌క్కా అని గురుమూర్తి స‌న్నిహితులు చెబుతున్న మాట‌.