ప‌వ‌న్‌ను రెచ్చ‌గొడుతున్న మిత్రుడు

రాజ‌కీయ నాయ‌కుల మాట‌ల‌కు అర్థాలే వేరు. మ‌న‌సులో ఏదో ఒక ఉద్దేశం లేకుండా నేత‌ల నుంచి మాట‌లు జాలువార‌వు. ఆంజ‌నేయుడి ముందు కుప్పిగంత‌లు వేసిన చందంగా, బీజేపీ ద‌గ్గ‌ర ప‌వ‌న్ ఆట‌లున్నాయి. త‌న‌కు తానై…

రాజ‌కీయ నాయ‌కుల మాట‌ల‌కు అర్థాలే వేరు. మ‌న‌సులో ఏదో ఒక ఉద్దేశం లేకుండా నేత‌ల నుంచి మాట‌లు జాలువార‌వు. ఆంజ‌నేయుడి ముందు కుప్పిగంత‌లు వేసిన చందంగా, బీజేపీ ద‌గ్గ‌ర ప‌వ‌న్ ఆట‌లున్నాయి. త‌న‌కు తానై వ‌చ్చి, పొత్తు కుదుర్చుకున్న ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న స‌మ‌యంలో ప‌క్క చూపులు చూస్తుండ‌డంపై బీజేపీ అధిష్టానం ఆగ్ర‌హంగా ఉంది. పొత్తుతో సంబంధం లేద‌న్న‌ట్టు తనకు తానుగా ఆప్ష‌న్లు ఇస్తూ ఇష్టానుసారం ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్న ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను ఏ మాత్రం లెక్క చేయ‌కూడ‌ద‌నే నిర్ణ‌యానికి బీజేపీ వ‌చ్చింది.

ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను రెచ్చ‌గొట్టేలా ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు వ్యాఖ్య‌లున్నాయి. ప‌లికెది వీర్రాజు అయినా, ప‌లికించేది మాత్రం బీజేపీ అధిష్టానం అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది. జ‌నంతోనే త‌మ పొత్తు అని, జ‌న‌సేన వ‌స్తే క‌లుపుకుని వెళ్తామ‌ని వీర్రాజు మాట‌ల వెనుక మ‌ర్మాన్ని అర్థం చేసుకోవ‌చ్చు. ఒక‌సారి మాట్లాడితే పొర‌పాటు అయి వుండొచ్చ‌ని అనుకోవ‌చ్చు. కానీ ప‌దేప‌దే ఉద్దేశ‌పూర్వ‌కంగానే ఆయ‌న ఆ మాట‌లంటున్నారు. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ జ‌నంతో పొత్తు అనే మాట‌పై మ‌రింత స్ప‌ష్ట‌త ఇవ్వ‌డం విశేషం.

‘జనంతో మా పొత్తు అనే మాట చాలా బలమైంది. ఈ వ్యాఖ్య వెనుక ఎంతో అర్ధం ఉంది. జనంతోనే మా పొత్తు.. వస్తే జనసేనతో పొత్తు’ అని మ‌రోసారి కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు చెప్పారు. ప‌వ‌న్ కోసం తాము ఎదురు చూడ‌డం లేద‌ని ఆయ‌న తేల్చి చెప్పారు. జ‌న‌సేన‌తో పొత్తు వుంటుంద‌ని తాము అనేక‌మార్లు చెప్పిన‌ప్ప‌టికీ, ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప‌రిగ‌ణ‌లోకి తీసుకోకుండా ఇష్టానుసారం వ్య‌వ‌హ‌రించ‌డంపై బీజేపీ అధిష్టానం ఆగ్ర‌హంగా వుంది.

రెండు చోట్ల పోటీ చేసి, క‌నీసం ఒక్క చోట కూడా గెల‌వ‌ని జ‌న‌సేన అధ్య‌క్షుడికే అంత అహంకారం వుంటే, దేశంతో పాటు జాతీయ స్థాయిలో మెజార్టీ రాష్ట్రాల్లో అధికారం చెలాయిస్తున్న త‌మ‌కెంత పొగ‌రు వుండాల‌ని బీజేపీ పెద్ద‌లు అంటున్న‌ట్టు స‌మాచారం. త‌మ‌ను కాద‌ని టీడీపీతో క‌లిసి వెళ్లి, ఎలా ఉనికి చాటుకుంటారో చూద్దామ‌నే అభిప్రాయంలో బీజేపీ పెద్ద‌లున్న‌ట్టు తెలిసింది. ఈ నేప‌థ్యంలో పొత్తు విష‌య‌మై ప‌వ‌న్‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోకుండా మాట్లాడాల‌ని సూచించిన‌ట్టు సమాచారం. 

టీడీపీతో క‌లిసి వెళ్లి ప‌వ‌న్ ఏం సాధిస్తారో చూద్దామ‌ని బీజేపీ నేత‌లు ఉన్నారు. అందుకే ప‌వ‌న్ కంటే జ‌నాన్ని న‌మ్ముకుంటే ప్ర‌యోజ‌నం వుంటుంద‌ని ఇంత‌కాలానికి బీజేపీకి  జ్ఞానోద‌యం అయ్యింద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.