Advertisement

Advertisement


Home > Politics - National

పంజాబ్ స్కూల్ ప్రిన్సిపాళ్లు.. ఛలో సింగపూర్

పంజాబ్ స్కూల్ ప్రిన్సిపాళ్లు.. ఛలో సింగపూర్

ఆమధ్య ఢిల్లీలోని స్కూల్ ప్రిన్సిపాళ్లను విదేశీ సదస్సులకు పంపించేందుకు లెఫ్ట్ నెంట్ గవర్నర్ ఆమోదం తెలపకపోవడంతో సీఎం కేజ్రీవాల్ తెగ ఇదైపోయారు. ఆ విషయంలో గవర్నర్ కి, సీఎంకి మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. అయితే తాజాగా పంజాబ్ లో అదే పార్టీ ప్రభుత్వం స్కూల్ ప్రిన్సిపాళ్లను సింగపూర్ పంపించింది. శిక్షణ కార్యక్రమాల కోసం అంటూ మొత్తం 36 మందిని సింగపూర్ లోని ప్రిన్సిపల్స్ అకాడమీకి పంపించారు సీఎం భగవంత్ మన్. ఈ పర్యటనను జెండా ఊపి ప్రారంభించారు.

ఫిబ్రవరి 6 నుంచి 10 వరకు సింగపూర్‌ లో జరిగే ప్రొఫెషనల్ టీచర్ ట్రైనింగ్ సెమినార్‌ లో వీరంతా పాల్గొంటారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థను పూర్తిగా మారుస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ గతేడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రజలకు ‘గ్యారంటీ’ ఇచ్చిందని దాన్నిప్పుడు నెరవేరుస్తున్నామని చెప్పారు సీఎం భగవంత్ మన్.

5 రోజుల శిక్షణ ద్వారా ప్రిన్సిపాల్స్ అందరూ విద్యా రంగంలో అత్యాధునిక సాంకేతికతలను నేర్చుకుంటారని సీఎం చెప్పారు. ఫస్ట్ బ్యాచ్ ట్రైనింగ్ కి వెళ్లినవారు ఫిబ్రవరి 11న తిరిగి వస్తారని, వారు తమ అనుభవాలను సహోద్యోగులతో పంచుకుంటారని చెప్పారు.

ఇక రెండో బ్యాచ్ లో మరో 30మందిని నన్యాంగ్ టెక్నాలజీ యూనివర్శిటీలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ కి పంపిస్తామని చెప్పారు సీఎం. కరోనా తర్వాత మారుతున్న విద్యా విధానాల గురించి ఈ బృందం శిక్షణ తీసుకుంటుందన్నారు. విద్యారంగంలో వస్తున్న మార్పులు, నూతన విధానాలపై అవగాహన పెంచుకుంటారని, ఆ అనుభవాలను వారంతా రాష్ట్రంలోని ఇతర ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులతో పంచుకునే అవకాశముంటుందని అన్నారు.

ఫిన్లాండ్ కూడా..

ఆరోగ్యం, విద్య రంగాలకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందనన్నారు పంజాబ్ సీఎం భగవంత్ మన్. ఉపాధ్యాయులను ఫిన్లాండ్‌ కు కూడా పంపుతామని తెలిపారు. సరికొత్త బోధనా మార్గాలు అందుబాటులో ఉన్న ప్రదేశాలకు తాము ఉపాధ్యాయులను పంపుతామని వెల్లడించారు. రాబోయే రాష్ట్ర బడ్జెట్‌లో విద్య కోసం కేటాయించే నిధులను కూడా భారీగా పెంచుతామన్నారు.

నిజంగా ఇది చాలా గొప్ప కార్యక్రమం. ప్రాధమిక రంగమైన విద్యారంగంలో ఇలా సమూల మార్పులు తీసుకొచ్చినప్పుడు, ఆటోమేటిగ్గా సమాజంతో పాటు దేశంలో మార్పు చోటుచేసుకుంటుంది. ఈ దిశగా పంజాబ్ ప్రభుత్వం తీసుకున్న చొరవను అభినందించాల్సిందే. మిగతా రాష్ట్రాలు కూడా ఈ కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?