నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి వైసీపీపై ఎందుకో విరక్తి కలిగింది. ప్రత్యామ్నాయ మార్గాన్ని చూసుకున్నారు. రాజకీయాల్లో ఇలాంటివన్నీ మామూలే. అయితే కోటంరెడ్డి పార్టీకి దూరమై, సొంతవాళ్లపైనే విమర్శలకు దిగారు. దీంతో అతనికి అదే రేంజ్‌లో పార్టీ, ప్రభుత్వ పెద్దలు సమాధానం ఇచ్చారు. ఇటు కోటంరెడ్డి, అటు వైసీపీ నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఎన్నికల సీజన్ కావడంతో రానున్న రోజుల్లో ఇలాంటివి మరిన్ని చూడాల్సి వస్తుంది.
ఈ నేపథ్యంలో కోటంరెడ్డికి ఓ వ్యక్తి ఫోన్ చేసి బండబూతులు తిట్టిన వీడియో వైరల్ అవుతోంది. ఇంటి దగ్గరికి వచ్చి కట్టేసుకుని వెళ్తామంటూ కోటంరెడ్డిని హెచ్చరించడం షాక్‌కు గురి చేస్తోంది. కోటంరెడ్డి రాజకీయాలతో ఎవరైనా విభేదించొచ్చు. వైసీపీ నేతలు, ప్రభుత్వ ముఖ్యులపై విమర్శలు చేసిన కోటంరెడ్డిపై రాజకీయంగా ఎదురు దాడి చేయడాన్ని ఎవరూ తప్పు పట్టరు. కానీ వైసీపీని, ప్రభుత్వాన్ని విభేదిస్తున్నాడనే కారణంతో ఆయనపై తిట్ల పురాణాన్ని సమర్థించడం సంస్కారం అనిపించుకోదు.
కోటంరెడ్డిపై దూషణకు దిగిన వ్యక్తి నేపథ్యం తెలిస్తే… అతని నుంచి వైసీపీ అప్రమత్తంగా వుండాల్సిన అవసరం ఎంతైనా వుంది. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నేత, కేంద్రమంత్రి రాందాస్ అథవాలే వెంట తిరుగుతుంటాడు. అలాగే వైఎస్ జగన్ దగ్గరి బంధువునని చెప్పుకుంటూ పైరవీలు చేసుకోవడమే వృత్తి, ప్రవృత్తి. నిజానికి వైఎస్సార్ కుటుంబంతో అతనికి ఎలాంటి సంబంధం లేదు. సదరు వ్యక్తిది గుంటూరు జిల్లా.
గతంలో నకిలీ ఐఏఎస్‌గా చెప్పుకుని భారీ మొత్తంలో డబ్బు వసూలు చేసిన కేసులో అనంతపురం పోలీసులు చితక్కొట్టారు. జైలు ఊచలు లెక్కపెట్టి బయటికొచ్చినా, అతని ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేదు. దీనికి తోడు బోలెడు కుటుంబ సభ్యులు. ఇద్దరు భార్యలు. అతనిపై ఒక ఇల్లాలు వేధింపుల కేసు పెట్టింది. ఇటీవల జనసేనాని పవన్‌కల్యాణ్ భార్య, కూతుళ్లను రేప్ చేస్తానంటూ అవాకులు చెవాకులు పేలిన వెధవ ఇతనే. అలాగే మరో ఇద్దరు యూట్యూబర్లకు వైసీపీ నాయకుడినంటూ ఫోన్ చేసి బెదిరింపులకు దిగాడు.
తాజాగా కోటంరెడ్డితో మాట్లాడిన తీరు గమనిస్తే…. ఇక సామాన్యులను ఏ స్థాయిలో బెదిరిస్తాడో అర్థం చేసుకోవచ్చు. తమను వ్యతిరేకించిన కోటంరెడ్డిని తిట్టాడని సంబరపడడం మాని, పార్టీకి నష్టం కలిగించే ఇలాంటి వారిని కట్టడి చేయడం వైసీపీకి మంచిది. కోటంరెడ్డిని తిట్టి, దాన్ని ఇతరత్రా ప్రయోజ నాలకు వాడుకునే కుట్రలో భాగంగానే ఇదంతా చేస్తున్నాడనే విమర్శ లేకపోలేదు.