మగాడు తిరగక చెడతాడు అంటారు.. కానీ ఈరోజుల్లో రాజకీయ నాయకుల పరిస్థితి కూడా అలాగే ఉంది. అందులోనూ తిరగక చెడ్డామనే బాధ చంద్రబాబులో బాగా ఉంది. గత ఎన్నికల సమయంలో జగన్ పాదయాత్ర వల్లే ఆయనకు విజయం దక్కిందని బలంగా నమ్ముతున్నారు చంద్రబాబు. ఒక్క ఛాన్స్ అని అడిగి అధికారంలోకి వచ్చారని ఇప్పటికీ బాబు అండ్ టీమ్ కామెంట్ చేయడం వెనక కారణం అదే.
అప్పట్లో గెలుపు ధీమాతో, పసుపు-కుంకుమ పేరుతో పంచిన డబ్బులపై నమ్మకంతో.. అతి విశ్వాసంతో ఎన్నికలకు వెళ్లి టీడీపీ చరిత్రలోనే ఎరగని భారీ ఓటమి చవిచూశారు బాబు. ఇప్పుడా తప్పు సరిదిద్దుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.
ఇప్పటికిప్పుడు ఏం చేయాలనేదానిపై క్లారిటీ లేదు కానీ ప్రభుత్వాన్ని తిట్టాలి.. ప్రజల్లోకి వెళ్లి మరీ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయాలని మాత్రం ఫిక్స్ అయ్యారు.. అందుకే బాబు, చినబాబు ఒకేసారి రంగంలోకి దిగుతున్నారు. జనవరి నుంచి యాత్రలు మొదలుపెట్టబోతున్నారు.
పాదయాత్రకు జై..
ఇప్పటికే చాలా సందర్భాల్లో చంద్రబాబు, లోకేష్ జనాల్లోకి వెళ్లినా పెద్దగా స్పందన రాలేదు. తాజాగా వరదల్లో బురద రాజకీయాలు చేయాలని వచ్చిన బాబుకి కూడా పెద్దగా ప్రతిఫలం దక్కలేదు. కానీ బాబు తన ప్రయత్నం వదిలిపెట్టాలనుకోవట్లేదు.
అందులోనూ ఇటీవలే బ్రహ్మాండంగా ఏడుపు సీన్ రక్తికట్టించారు. దాని కొనసాగింపుగా ఇప్పుడు జనంలోకి వెళ్లి ఏడ్చే సీన్లు రాసుకున్నారు. అయితే చంద్రబాబు వయోభారం రీత్యా ఆయనకు బస్సుయాత్ర, చినబాబుకి పాదయాత్ర డిజైన్ చేసినట్టు తెలుస్తోంది.
జనవరి 1 మహూర్తం..?
ఇటీవల జరిగిన టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశంలో దీనిపై నిర్ణయం తీసేసుకున్నట్టు తెలుస్తోంది. ఏపీలోని 175 నియోజకవర్గాల్లో కనీసం 100 నియోజకవర్గాల్లో లోకేష్ పాదయాత్ర ఉంటుంది. అదే సమయంలో చంద్రబాబు మొత్తం 175 నియోజకవర్గాల్లో బస్సులో తిరిగి రావాలనుకుంటున్నారు.
ఒకరు ఉత్తరాంధ్ర నుంచి, ఇంకొకరు రాయలసీమ నుంచి యాత్ర మొదలు పెట్టేలా నిర్ణయం తీసుకోబోతున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే జనవరి 1నుంచి ఈ ఇద్దరి యాత్రలు మొదలవుతాయి.
టికెట్ల కన్ఫర్మేషన్ కూడా అప్పుడే..
యాత్రల్లోనే టికెట్ల కన్ఫర్మేషన్ కూడా జరుగుతుందట. వలసలకు డెడ్ లైన్ ఫిక్స్ చేసుకుని మరీ ఈ పని మొదలుపెడతారట. కొత్తగా వచ్చేవారి కంటే, పార్టీని నమ్ముకుని ఉన్నవారికే టికెట్ల కేటాయింపులో ప్రాధాన్యం ఉంటుందని భావిస్తున్నారు.
మొత్తమ్మీద జనాల్లోకి రాకపోవడం వల్లే 2019లో తాము ఓడిపోయామని అనుకుంటున్నారు తండ్రీకొడుకులిద్దరూ. ఆ అవకాశాన్ని జగన్ కి ఇచ్చామని బాధపడుతున్నారు. అందుకే ఇప్పుడు అధికారం కోసం జనాల్లోకి వస్తున్నారు.
ఆల్రెడీ చంద్రబాబు ఎంత పనిమంతుడో జనం చూసేశారు, రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం లాంటి హామీలు గతంలో ఎలా అమలు చేశారో అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. కాబట్టి.. ఇప్పుడు చంద్రబాబు, లోకేష్ యాత్రకు ఎలాంటి రిజల్ట్ వస్తుందో అందరికీ తెలిసిందే.