హెడ్డింగ్ చూసి, ఆర్ఆర్ఆర్ రిలీజ్ కు రెడీ అవుతోంది కాబట్టి మెగా ఫ్యాన్స్, నందమూరి అభిమానులు కలిసిపోయారని అనుకోవద్దు. ఇది ఆ కలిసిపోవడం కాదు, రాజకీయంగా క్షేత్రస్థాయిలో ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ కలిసిపోయారు. అది కూడా చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో. ఈసారి కుప్పంలో బాబు లేదా లోకేష్ అడుగుపెడితే తమ సత్తా ఏంటో చూపిస్తామంటున్నారు.
ఇంతకీ ఏం జరిగింది?
ఇది అందరికీ తెలిసిన విషయమే. తన భార్య భువనేశ్వరిని అసెంబ్లీలో ఏదో అన్నారంటూ తన ఎమ్మెల్యేలతో కలిసి చంద్రబాబు వాకౌట్ చేశారు. అక్కడ ఏదీ అనకపోయినా బయటకొచ్చి సీన్ క్రియేట్ చేసే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా నందమూరి కుటుంబ సభ్యులతో ప్రెస్ మీట్ పెట్టించారు.
జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు చేయించారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో కనీస ధర్మంగా జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందించాడు. భువనేశ్వరి, చంద్రబాబు పేర్లు ప్రస్తావించకుండా.. హుందాగా వ్యవహరిస్తూ తన స్పందన తెలియజేశాడు. రాజకీయ వ్యవస్థలో ఇలాంటివి వాంఛనీయం కాదన్నాడు.
సరిగ్గా ఇక్కడే టీడీపీ నేతలకు కాలింది. టీడీపీ నేతలకు కాలింది అనేకంటే, చంద్రబాబే తనే నేతల్ని ఎన్టీఆర్ పైకి ఎగదోశాడనడం కరెక్ట్. వర్ల రామయ్య లాంటి నేతలు జూనియర్ ఎన్టీఆర్ పై విరుచుకుపడ్డారు. “అదేం స్పందన, దమ్ము లేదు, కోపం లేదు” అంటూ విమర్శలు అందుకున్నారు. మొత్తంగా భువనేశ్వరి ఎపిసోడ్ ను, దానిపై ఎన్టీఆర్ స్పందనను సాకుగా చూపుతా జూనియర్ ను పార్టీకి పూర్తిగా దూరం చేసే కార్యక్రమాన్ని దిగ్విజయంగా మొదలుపెట్టారు.
రగిలిపోతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్
టీడీపీ అనుసరిస్తున్న ఈ వ్యవహార శైలి ఇప్పుడు తారక్ అభిమానులకు కోపం తెప్పిస్తోంది. ఇన్నాళ్లూ ఏ హీరో అయితే పార్టీలోకి రావాలని, పగ్గాలు చేపట్టాలని వాళ్లు కోరుకున్నారో.. ఇప్పుడు అదే హీరోకు పొగబెట్టే కార్యక్రమం జరుగుతుంటే వాళ్లు సహించలేకపోయారు. మొన్నటివరకు వీళ్లే కుప్పం వేదికగా ఎన్టీఆర్ జెండాలు ఎగరేశారు, ఎన్టీఆర్ కు ఫ్లెక్సీలు కట్టారు, బాబు-లోకేష్ వస్తే ఎన్టీఆర్ కు అనుకూలంగా నినాదాలు చేశారు. ఇప్పుడు అలాంటి ఎన్టీఆర్ ను బాబు సైడ్ చేయడం చూస్తూ తట్టుకోలేకపోతున్నారు.
ఈ మేరకు కుప్పం కేంద్రంగా తారక్ ఫ్యాన్స్ అంతా ఒక్కటయ్యారు. ఈసారి చంద్రబాబు లేదా లోకేష్ కుప్పంలో అడుగుపెడితే తమ సత్తా చూపిస్తామంటూ సవాల్ చేస్తున్నారు. వీళ్లకు మెగాభిమానులు పూర్తి మద్దతు అందిస్తున్నారు. కుప్పం వేదికగా ఏం చేసినా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు తమ మద్దతు ఉంటుందని బాహాటంగా ప్రకటించారు.
ఇప్పుడు బాబు పరిస్థితేంటి..?
ఎన్టీఆర్ అభిమానులు, మెగా ఫ్యాన్స్ కలిసిపోవడంతో ఇప్పుడు బాబు పరిస్థితి మరింత దిగజారింది. ఈసారి కుప్పం ప్రాంతంలో అడుగుపెట్టాలంటే చంద్రబాబు-లోకేష్ ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. ఈ సెగ ఇక్కడితో ఆగదు. రాబోయే ఎన్నికల నాటికి ఇది మరో పెద్ద ఉద్యమంగా మారి, చాపకింద నీరులా టీడీపీని చుట్టేసే ప్రమాదం ఉందంటూ ఇప్పటికే చంద్రబాబుకు రిపోర్టులు అందుతున్నాయి.
ఇప్పటికే కుప్పం ఖాళీ చేయాల్సిన స్థితికి వచ్చారు చంద్రబాబు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సెగతో రాష్ట్రాన్నే ఖాళీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీన్ని బాబు తన 40 ఇయర్స్ బుర్రతో ఎలా ఎదుర్కొంటారో చూడాలి.