సొంత గోతిని తవ్వుకుంటున్న చంద్రబాబు!

చంద్రబాబునాయుడును అందరూ రాజకీయ చాణక్యుడు అని అంటూ ఉంటారు. కానీ ఆయన చాణక్యుడి కాలం నాటి తెలివితేటలను మరిచిపోయి.. అంతకంటె పాచిపోయిన పాత తరహా తెలివితేటలను నవతరం రాజకీయాలకు వర్తింపజేయాలని, అడ్డదారుల్లో లబ్ధి పొందాలని…

చంద్రబాబునాయుడును అందరూ రాజకీయ చాణక్యుడు అని అంటూ ఉంటారు. కానీ ఆయన చాణక్యుడి కాలం నాటి తెలివితేటలను మరిచిపోయి.. అంతకంటె పాచిపోయిన పాత తరహా తెలివితేటలను నవతరం రాజకీయాలకు వర్తింపజేయాలని, అడ్డదారుల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారు. 

ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా మహిళల ఆత్మగౌరవ సభలు నిర్వహించాలని తెలుగుదేశం అధినేత సంకల్పించడం చాలా కామెడీగా ఉంది. ఈ నిర్ణయంతో తన పార్టీకి ఆయనే గోతిని తవ్వుతున్నట్లు అవుతుందని ప్రజలు నవ్వుకుంటున్నారు. 

మొట్టమొదటగా చంద్రబాబు ఒక సంగతి గుర్తించాలి. కేవలం సభలు పెట్టడం ద్వారా.. తన వైఫల్యాన్ని ఇతరుల మీదకి నెట్టేయడం ద్వారా, ఇతరుల్ని బూచిగా చూపిస్తూ పెద్దపెద్ద ప్రసంగాలు చేయడం ద్వారా.. గుడ్లురిమి వేలు చూపించి బెదిరించడం ద్వారా.. ప్రజల మనసు గెలుచుకోవడం సాధ్యమే అయితే చంద్రబాబునాయుడు 2019 ఎన్నికల్లో ఓడిపోయే వారే కాదు. పెద్ద పెద్ద సభలు పెట్టక్కర్లేదు. కానీ ప్రజల ముందు నిజాయితీగా మాట్లాడాలి. చంద్రబాబు వద్ద లేనిదే అది. అందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయి.

తన పాలన సాగిన కాలంలో.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన ప్రత్యేకహోదాను కాలరాసిన వ్యక్తి ఆయనే. కేంద్రంతో కుమ్మక్కు అయి.. హోదాకోసం రాష్ట్రంలో జరిగిన ఉద్యమాల్ని అణచివేసి ద్రోహం చేశారు. 

తన పదవీకాలం ముగిసే సమయానికి.. అన్నాళ్ల వైఫల్యాల మీదనుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి బీజేపీకి కటీఫ్ చెప్పేసి.. ప్రభుత్వం డబ్బులతో ధర్మపోరాట దీక్షల పేరిట పెద్ద పెద్ద సభలు పెట్టారు. తద్వారా.. మోడీని విలన్ ను చేయాలనుకున్నారు. కానీ.. విజ్ఞులైన ప్రజలు అసలు పాపంలో ఇద్దరికీ భాగం ఉందని గుర్తించారు గనుకనే.. జగన్మోహన రెడ్డి సీఎం అయ్యారు.

ఇప్పుడు సభల టెక్నిక్ మళ్లీ వాడుతున్నారు. తన భార్యను అవమానించారని జరిగిందో లేదో తెలియని సంఘటనను బూచిగా చూపించి.. మహిళల ఆత్మగౌరవ సభలనే డ్రామా నడిపిస్తున్నారు. 

జగన్ పాలన మహిళకు భద్రత పరంగా, గౌరవం పరంగా, సాధికారత పరంగా, ఆర్థిక పరంగా ఎంతో అండగా ఉంటున్న సంగతి తెలిసిందే. మహిళల్లో ప్రత్యేకించి జగన్ పథకాల పట్ల ఎంతో సానుకూలత ఉంది. ఇలాంటి నేపథ్యంలో మహిళల ఆత్మగౌరవ సభలు అని పెట్టే బదులుగా.. ‘నా భార్య ఆత్మగౌరవ సభలు’ అనే పేరుతో చంద్రబాబునాయుడు రాష్ట్రమంతా డ్రామాలు చేస్తే బాగుంటుందని పలువురు ఎద్దేవా చేస్తున్నారు. 

చంద్రబాబునాయుడు కన్నీళ్లు కార్చి.. తన భార్యను బజారుకీడ్చి రాజకీయం చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపించారు. ఆయన కన్నీళ్లు చూసిన రోజున కొందరు- వైసీపీ ఆరోపణల్ని నమ్మలేదు. కానీ.. ఇప్పుడు చంద్రబాబునాయుడు డ్రామా గౌరవ సభలు ఆలోచన గమనిస్తే ఆయన రాజకీయం చేయాలనుకుంటున్నది నిజమే అని అర్థమవుతుంది.