జయము జయము జగనన్నా..! కాస్త చూసుకో అన్నా..!

గతంలో జయము జయము చంద్రన్నా అనే భజనా కాలక్షేపం టీడీపీ కొంప ముంచిన విషయం అందరికి తెలిసిందే. ఆ స్థాయిలో కాదు కానీ 'జయము జయము జగనన్నా' అనే భజన కూడా ఇటీవల బాగానే…

గతంలో జయము జయము చంద్రన్నా అనే భజనా కాలక్షేపం టీడీపీ కొంప ముంచిన విషయం అందరికి తెలిసిందే. ఆ స్థాయిలో కాదు కానీ 'జయము జయము జగనన్నా' అనే భజన కూడా ఇటీవల బాగానే మొదలైంది. మంత్రి పదవుల కోసమో, లేదా ఇంకేదైనా ప్రత్యేక గుర్తింపు కోసమో ఈ స్త్రోత్రాలు మామూలే. అంతవరకే అవి పరిమితమైతే బాగానే ఉంటుంది, మరీ ప్రతిపక్షాలకు టార్గెట్ అయితే మాత్రం అసలుకే మోసం వస్తుంది.

తాజాగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలతో సాక్షాత్తూ స్పీకరే పది నిమిషాల పాటు నవ్వుకున్నారు. పదే పదే ఆయన మాటలు గుర్తు తెచ్చుకుని మరీ నవ్వలేక ఇబ్బంది పడ్డారు. స్పీకరే కాదు.. మిగతా సభ్యులు కూడా మధుసూదన్ రెడ్డి హడావిడి, ఆత్రం చూసి ఔరా అని ముక్కున వేలేసుకున్నారు.

జగన్ ని గొప్ప నాయకుడు అని పొగిడితే పర్లేదు కానీ.. అక్కడితో ఆగిపోకుండా నడిచే దేవుడంటూ స్తోత్రం చేస్తేనే కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అయితే పొగడ్తల్ని, విమర్శల్ని కూడా ఒకే రకంగా ఆస్వాదించగల నేర్పు జగన్ కి ఉంది. అందుకే ఆయన అసెంబ్లీలో తనపై చేసే భజన కార్యక్రమాన్ని సరదాగా తీసుకుంటుంటారు. ఇటీవలే తన నియోజకవర్గంలో నవరత్నాల గుడి అంటూ జగన్ ఫొటోతో ఓ ఆలయాన్నే ఏర్పాటు చేసిన మధుసూదన్ రెడ్డి.. కేబినెట్ లో ఎంట్రీ కోసం సీరియస్ గా ప్రయత్నిస్తున్నారనే టాక్ ఉంది.

అయితే ఆయన తన అమాయకత్వాన్నే దానికి తొలి మెట్టుగా వాడుకుంటున్నారు. జగన్ ని పొగిడే విషయంలో ఎక్కడెక్కడినుంచో ఉదాహరణలు తెస్తున్నారు. కమలా హ్యారిస్ అంటారు, గ్రీకు చరిత్ర చెబుతారు, కేవలం జగన్ ని పొగిడేందుకే ఓ బండిల్ పేపర్లు రెడీ చేసి, వాటిలో ఏది ముందో ఏదో వెనకో తెలియక తికమక పడుతూ అందర్నీ కన్ఫ్యూజన్లో పెట్టేసి, స్పీకర్ సహా అందరూ పడిపడి నవ్వుకునేలా చేశారు.

గ్రీకు చరిత్రలోనే సంక్షేమ పథకాల ప్రస్తావన ఉంది అని ఏదో ప్రూఫ్ తీసుకొచ్చారు ఎమ్మెల్యే. దాన్ని చదివి వినిపించొచ్చు కదా అని తోటి ఎమ్మెల్యేలు అడగడంతోనే.. అది గ్రీకులో ఉంది కదా అని కౌంటర్ ఇచ్చి మళ్లీ నవ్వించారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ప్రతిపక్షంలేని అసెంబ్లీలో ఏముంటుంది అనుకునే లోపే.. మంచి పండ్ డైలాగులు కూడా పడుతున్నాయి. చంద్రబాబు సంస్కారానికి నా నమస్కారం అంటూ ఏకంగా జగనే పంచ్ డైలాగ్ వేశారు. ఆ తర్వాత ఇతర నేతలు కూడా బురద రాజకీయాన్ని ఆడుకున్నారు. ఫైనల్ గా బియ్యపు మధుసూదన్ రెడ్డి ఇలా అందరినీ కాసేపు రిలాక్స్ మూడ్ లోకి తీసుకెళ్లారు.

అయితే ఇలాంటి ప్రయత్నాలను జగన్ ఓ కంట కనిపెట్టడం మంచిదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పట్నుంచి ప్రతి అసెంబ్లీ సెషన్ లో ఇలాంటి భజన జరుగుతోంది. చూస్తుంటే ఈసారి శృతి మించేలా కనిపిస్తోంది. కచ్చితంగా ఇలాంటి పొగడ్తల వర్షానికి చెక్ పెట్టాలి. లేకపోతే ఆ వర్షం కాస్తా పెరిగి పెద్దదై వాయుగుండంలా మారి అలజడి సృష్టించే ప్రమాదం ఉంది. గతంలో చంద్రబాబుకు జరిగిందిదే..!