టాలీవుడ్ లో స్లీపింగ్ పార్టనర్స్

ఇప్పుడున్న పరిస్థితుల్లో భారీ బడ్జెట్ సినిమా తీయాలంటే అందరికీ సాధ్యం కాదు. డబ్బులు చాలామంది దగ్గర ఉన్నాయి, అలాంటి వాళ్లకు ఫైనాన్స్ చేయడానికి కూడా చాలా మంది సిద్ధం. కానీ పూర్తిస్థాయిలో నిర్మాణ రంగంలోకి…

ఇప్పుడున్న పరిస్థితుల్లో భారీ బడ్జెట్ సినిమా తీయాలంటే అందరికీ సాధ్యం కాదు. డబ్బులు చాలామంది దగ్గర ఉన్నాయి, అలాంటి వాళ్లకు ఫైనాన్స్ చేయడానికి కూడా చాలా మంది సిద్ధం. కానీ పూర్తిస్థాయిలో నిర్మాణ రంగంలోకి దిగి ఓ భారీ బడ్జెట్ సినిమా నిర్మించి, రిలీజ్ చేసేంత ధైర్యం చేయడం లేదు కొన్ని సౌండ్ పార్టీలు. అందుకే ఇలాంటి వాళ్లంతా మధ్యేమార్గంగా స్లీపింగ్ పార్టనర్స్ అవతారం ఎత్తుతున్నారు.

ఉదాహరణకు జీ స్టుడియోస్ సంస్థనే తీసుకుందాం. వీళ్లకు మూవీ ప్రొడక్షన్ లో చాలా అనుభవం ఉంది. బాలీవుడ్ లో నేరుగా సినిమాలు తీస్తున్న ట్రాక్ రికార్డ్ ఉంది. గతంలో టాలీవుడ్ లో కూడా ఇదే పని చేశారు. కానీ ఇప్పుడు మాత్రం మారిన పరిస్థితుల నేపథ్యంలో సోలోగా రంగంలోకి దిగడం లేదు. పలు నిర్మాణ సంస్థలతో కలిసి పెట్టుబడులు పెడుతోంది. 

ఇంకా చెప్పాలంటే వీళ్లు సెట్స్ లోకి కూడా రావడం లేదు. సినిమా ప్రీ-ప్రొడక్షన్ స్టేజ్ లోనే పక్కాగా అగ్రిమెంట్లు కుదుర్చుకొని, అసలు నిర్మాతకు కొంత మొత్తం చెల్లించి జీ స్టుడియోస్ లోగో వేయించుకుంటున్నారు. అగ్రిమెంట్ లోనే శాటిలైట్, డిజిటల్ రైట్స్ కూడా రాయించుకుంటున్నారు.

బీ4యు అనే ఛానెల్ కూడా ఇదే పని చేస్తోంది. బయట జనాలకు ఇదొక ఛానెల్ లేదా మ్యూజిక్ ఛానెల్ గా మాత్రమే తెలుసు. కానీ వీళ్లు టాలీవుడ్ లో పెట్టుబడులు పెడుతున్నారు. హిందీ డబ్బింగ్ రైట్స్ తో పాటు మరికొన్ని హక్కుల్ని తమ పేర రాయించుకుంటున్నారు. సహ-నిర్మాతగా పేరు వేయించుకుంటున్నారు.

ఈమధ్య ఆదిత్య మ్యూజిక్ సంస్థ కూడా ఇదే పని చేస్తోంది. మ్యూజిక్ లేబుల్ నుంచి నిర్మాణ రంగంలోకి వెళ్లిన ఈ కంపెనీ.. ఈ బిజినెస్ లో ఆటుపోట్లు చూసింది. సూటిగా చెప్పాలంటే చేతులు కాల్చుకుంది. దీంతో వీళ్లు కూడా స్లీపింగ్ పార్టనర్స్ గా మారిపోయారు. ప్రస్తుతం నితిన్ చేస్తున్న ఓ సినిమాకు ఫండింగ్ ఇస్తున్న ఈ సంస్థ.. ఆ మూవీకి సంబంధించి కొన్ని రైట్స్ ను రాయించుకున్నారు.

వీళ్లు మాత్రమే కాకుండా.. శరత్ మరార్, మ్యాంగో రామ్, సోనీ కంపెనీ జనాలు కూడా ఇలా నిర్మాణ రంగంలో మధ్యేమార్గాన్ని అనుసరిస్తున్నారు. శరత్ మరార్ ఇప్పటికే పలు నిర్మాణ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకోగా.. మ్యాంగో రామ్ కూడా ఇప్పుడిప్పుడే పెట్టుబడుల మొత్తాన్ని పెంచుతున్నారు. ప్రొడక్షన్ తో సంబంధం లేకపోయినా, పోస్టర్ పై తన బ్యానర్ పేరు వచ్చేలా సెట్ చేసుకుంటున్నారు.

నిజానికి హీరో మహేష్ బాబు చేస్తోంది కూడా ఇదే. తన సినిమాలకు జీఎంబీ అనే బ్యానర్ తగిలిస్తాడు తప్ప, పూర్తిస్థాయిలో నిర్మాణ వ్యవహారాల్లో మహేష్ పాలుపంచుకోడు. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న మేజర్ సినిమాకు కూడా మహేష్ ఫుల్ లెంగ్త్ ప్రొడ్యూసర్ కాదు. ఇలా టాలీవుడ్ లో ప్రస్తుతం స్లీపింగ్ పార్టనర్స్ ఎక్కువైపోయారు. ఒక విధంగా బడా నిర్మాతలకు ఇది మంచిదే.