నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వర్సెస్ వైసీపీ ఎపిసోడ్ రసవత్తరంగా సాగుతోంది. కోటంరెడ్డిని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ తదితరులు టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు. తాను తగ్గేదే లే అంటూ కోటంరెడ్డి కూడా వరుస మీడియా సమావేశాలు నిర్వహిస్తూ ఎదురు దాడికి దిగారు. ఇవాళ కూడా కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు.
బావా కాకాణి అంటూ చురకలు అంటించారు. జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఆనం రామనారాయణరెడ్డి చేస్తే, ఆయన పట్ల విధేయతగా ఉన్నావా? అని కోటంరెడ్డి నిలదీశారు. వైఎస్ జగన్ విషయంలో తన విధేయత, విశ్వాసం గురించి కాకాణి ప్రశ్నించడం వల్లే తాను కూడా సమాధానం చెప్పాల్సి వచ్చిందని ఆయన అన్నారు. గతంలో వైఎస్ జగన్ నెల్లూరుకు ఓదార్పు యాత్ర నిమిత్తం వస్తే… కాకాణి ఏమన్నారో ఈ సందర్భంగా కోటంరెడ్డి గుర్తు చేశారు.
కాంగ్రెస్ పార్టీ మహాసముద్రమని, అందులో జగన్ అనే వ్యక్తి చిన్న నీటి బొట్టు అని కాకాణి అన్నాడని కోటంరెడ్డి గుర్తు చేశారు. ఇలా కోటంరెడ్డి, వైసీపీ నేతలు పరస్పరం విమర్శించుకుంటుంటే…. నెల్లూరు టీడీపీ నేతలు మాత్రం సినిమా చూస్తున్నట్టుగా, ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు.
నెల్లూరు రూరల్ నుంచి టీడీపీ తరపున పోటీ చేస్తానని కోటంరెడ్డి ప్రకటించినా, ఆ పార్టీ నాయకులు నోరు మెదపడం లేదు. వీళ్ల గొడవ పతాక స్థాయికి చేరడం, టీడీపీలో కోటంరెడ్డి చేరిన తర్వాతే ఏమైనా మాట్లాడొచ్చనే అభిప్రాయం ప్రధాన ప్రతిపక్షం వున్నట్టు తెలిసింది. అందుకే నెల్లూరు వైసీపీలో ముసలాన్ని చూస్తూ టీడీపీ ఎంజాయ్ చేస్తోంది.