పవన్‌ను చూసి భయపడుతున్న జగన్!

‘‘ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి భయపడిపోతున్నారు. జనసేనాని పవన్ కల్యాణ్ అంటే.. ఆయనలో వణుకు మొదలవుతోంది. చెప్పుకోడానికి పార్టీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ.. ప్రభుత్వం స్థిరంగా ఉంటుందన్న నమ్మకం ఆయనకు లేదు. అందుకే నిత్యం…

‘‘ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి భయపడిపోతున్నారు. జనసేనాని పవన్ కల్యాణ్ అంటే.. ఆయనలో వణుకు మొదలవుతోంది. చెప్పుకోడానికి పార్టీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ.. ప్రభుత్వం స్థిరంగా ఉంటుందన్న నమ్మకం ఆయనకు లేదు. అందుకే నిత్యం భయంతో గడుపుతున్నారు. పవన్ కల్యాణ్ పుణ్యమాని.. తన పార్టీ ఎమ్మెల్యేలందరూ వీడిపోతారేమో… తన పాలన పట్ల వారు విసిగిపోతారేమో.. పవన్ కల్యాణ్ చెంతకు చేరుతారేమో.. అని కూడా ఆయనలో భయం నెలకొంటోంది.’’

… ఈ మాటలు నమ్మాలని అనిపించడం లేదా? నమ్మకపోతే మీ ఖర్మ. మీరు అజ్ఞానులు. ఈ విషయాన్ని నమ్మగలిగేపాటి జ్ఞానం మీకు లేదని అర్థం. జ్ఞానం అనే ఖడ్గాన్ని తన ఆయుధంగా కలిగి ఉన్న పవన్ కల్యాణ్ మాటల ప్రకారం ఇది నికార్సయిన సత్యం.

అవునట… పవన్ కల్యాణ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగిస్తున్న పోరాటాలను చూసి.. సీఎం జగన్మోహన రెడ్డి భయపడిపోతున్నారట. 151 మంది ఎమ్మెల్యేలున్నా కూడా ఆయనలో భయం ఉందిట. ఈయన తాను ఓడిపోయినా కూడా ధైర్యంగా నిలబడి పోరాడుతున్నాడుట. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం మాత్రమే తన ఎజెండాగా చేసుకున్న పవన్ కల్యాణ్.. మంచి చెడుల తేడా కూడా తెలియకుండా.. ఏది పడితే అది మాట్లాడుతుండడానికి ఇదొక నిదర్శనం.

పవన్ తన తిరుపతి యాత్రలో.. యథారీతిగా జగన్ మీద నిప్పులు చెరిగారు. ప్రజలను మతం పేరిట విభజిస్తున్నారంటూ.. ఆయన సెలవిచ్చారు. నా వద్ద బాంబులు, కత్తులు లేవు.. ధైర్యం, జ్ఞానం అనే ఖడ్గాలున్నాయి.. అంటూ పవన్ క్లారిటీ కూడా ఇచ్చారు. ఇంటర్మీడియట్ గట్టు దాటలేకపోయినప్పటికీ.. తనలోని జ్ఞానం ఎంతటి పదునైన ఖడ్గమో ఆయనకు ప్రజలకు వివరించి చెప్పే ప్రయత్నం చేశారు.

గెలుస్తాననే నమ్మకంతో ఒక నియోజకవర్గం నుంచి పోటీచేసే దమ్ము లేక… ఏదో ఒకచోట కులం, అదృష్టం కలిసొస్తాయనే ఆశతో.. భయపడుతూ… భయపడుతూ.. రెండు చోట్ల బరిలోకి దిగిన పవన్ కల్యాణ్ ఇప్పుడు తనవద్ద ధైర్యం ఖడ్గంలాగా ఉన్నదని సెలవిస్తున్నారు. జగన్ ను తూలనాడే ఎజెండాతో పవన్.. లాజిక్కులు మరచిపోయే.. హాస్యాస్పదమైన డైలాగులు వేస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు.