పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అయితే ప్రజలకు మేలు జరుగుతుందో లేదో చెప్పలేం కానీ, పవన్ కల్యాణ్ పర్యటనలు అంటేనే స్థానికులు భయపడిపోతున్నారు. మొన్నటికి మొన్న రేణిగుంటలో పవన్ ఇలా ల్యాండ్ అయితే అలా పాతిక సెల్ ఫోన్లు హాంఫట్.
తాజాగా పవన్ ఓ రైతుబజార్ కి వెళ్లారు. ఉల్లి కష్టాలు స్వయంగా తెలుసుకుందామని నేరుగా లోపలికి దూసుకెళ్లారు. అంతే.. అక్కడ ఉల్లి గుల్ల అయింది. 50వేల రూపాయల సరుకు నుజ్జునుజ్జయింది.
ప్రజల కష్టాలు తెలుసుకునేవారెవరూ మందీ మార్బలం వెంటబెట్టుకుని వెళ్లరు. కానీ జనసేనాని మాత్రం జనసైనికులందర్నీ తోలుకెళ్లారు. వీరితో పాటు కెమెరామెన్లు, రిపోర్టర్లు.. పవన్ ఉల్లిపాయల్ని చేతులో పట్టుకునే సీన్ షూట్ చేయాలని తెగ ఉబలాటపడ్డారు. దాని ఫలితమే ఇది. రైతుబజార్లో ఉల్లిపాయలన్నీ తొక్కిపడేశారు కెమెరామెన్లు, జనసైనికులు.
కేవలం ఉల్లిపాయల వద్దే కాదు, రైతుబజార్లో మిగతా దుకాణదారులు కూడా ఈరోజు దారుణంగా నష్టపోయారు. పవన్ ఉన్న 2 గంటల సేపు బేరాల్లేవు, పవన్ మందీ మార్బలం తొక్కేసి నాశనం చేసిన సరుకు మరోవైపు. దీంతో వ్యాపారస్తులు పవన్ ముందే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అటు పవన్ కూడా వద్దయ్యా, తొక్కేయకండయ్యా.. అంటూ మైక్ లో అందరికీ సర్దిచెప్పినా ఆయన మాట పట్టించుకునేవారు అక్కడెవరూ ఉండరనే విషయం అందరికీ తెలిసిందే.
తిరుపతి రైతుబజార్ వ్యాపారస్తులంతా ఈరోజు పవన్ ని తిట్టుకున్నవాళ్లే. కేవలం హడావిడి చేయడానికే పవన్ రాయలసీమ టూర్ కి వెళ్లినట్టు అర్థమవుతోంది. ముందుగా షెడ్యూల్ చేసుకున్న చర్చోపచర్చలు ఓవైపు, ఇలా ఉరుములేని పిడుగులా జనంలోకి రావడం మరోవైపు. పవన్ కల్యాణ్ జనంలోకి వస్తోంది వారి సమస్యలు తెలుసుకోడానికి కాదు, తన బలం-బలగం చూపించడానికే అన్నట్టుంది.
ఇలా హడావిడి చేసి, ప్రభుత్వంపై విమర్శలు గుప్పించి పరారైపోయే పవన్ కి, ఐదేళ్ల టీడీపీ హయాంలో ఏ సమస్యా గుర్తుకు రాకపోవడం విడ్డూరం కాక ఇంకేంటి?