గూగుల్ పే వినియోగదారులకు శుభవార్త. స్క్రాచ్ కార్డును రూ.500 నుండి రూ.5000 వరకు పొందండి.
నిన్నట్నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్ ఇది. దాని కిందే అందంగా డిజైన్ చేసిన లింక్ కూడా కనిపిస్తోంది. 5వేల రూపాయలకు ఆశపడి ఆ లింక్ క్లిక్ చేస్తే మీ డేటా మొత్తం గల్లంతే. అది వైరస్ తో కూడిన లింక్. ఆ లింక్ ద్వారా మన మొబైల్ నుంచి కాంటాక్స్, ఫొటోస్ మొత్తం అది లాగేస్తుంది. అంతేకాదు.. మన గూగుల్ పే ఎకౌంట్ తో లింక్ అయిన ఖాతా, దానికి సంబంధించిన పాస్ వర్డ్స్ కూడా ఇది హ్యాక్ చేస్తుంది.
ఇప్పటికే చాలామంది ఈ లింక్ క్లిక్ చేసి ఇబ్బందులు పడుతున్నారు. కొంతమందికి రివర్స్ లో పేమెంట్ రిక్వెస్టులు కూడా వస్తున్నాయి. అది క్లిక్ చేస్తే, సంబంధిత మొత్తాన్ని మరో ఎకౌంట్ కు ట్రాన్సఫర్ చేయడానికి మీరు అనుమతి ఇచ్చినట్టే. వెంటనే మీ ఎకౌంట్ నుంచి డబ్బులు మాయమౌతాయి.
తమ యాప్ ప్రమోషన్ కోసం గూగుల్ ఎప్పటికప్పుడు ఆఫర్లు ప్రవేశపెడుతోంది. రీసెంట్ గా వెయ్యి రూపాయల ఖరీదైన దీపావళి ఆఫర్ పెట్టింది. ప్రస్తుతం లక్ష రూపాయల విలువ చేసే వీక్లీ ఆఫర్ ను కూడా ప్రవేశపెట్టింది. సోమవారం నుంచి సోమవారం లోపు కనీసం 150 రూపాయలు మరో ఎకౌంట్ కు బదిలీ చేసి స్క్రీచ్ కార్డులు పొందవచ్చని చెబుతోంది.
చాలామంది యూజర్లు గూగుల్ పేకు అలవాటు పడ్డారు. పైగా స్క్రాచ్ కార్డ్ పేరిట బాగానే రివార్డు వస్తుండడం, ఆ వచ్చిన మొత్తం నేరుగా బ్యాంక్ ఎకౌంట్ లోనే జమ అవ్వడంతో చాలామంది గూగుల్ పేకు మారుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకొని ఓ గ్యాంగ్, అచ్చం గూగుల్ పే ఆఫర్ ను పోలేలా లింక్ తయారుచేసి సోషల్ మీడియాలో వదుల్తున్నారు. ఏమాత్రం అప్రమత్తంగా లేకపోయినా, మీ డేటాతో పాటు డబ్బు కూడా పోగొట్టుకోవాల్సి వస్తుంది.